క్రికెట్ కెనడాకు ఐసీసీ షాక్..సభ్యత్వం తక్షణమే రద్దు!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్ కెనడా బోర్డు సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్వహణ బాధ్యతల్లో తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినందుకు గానూ ఈ సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. గత ఏప్రిల్ నెలలో కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (సీబీసీ) ప్రసారం చేసిన ఒక డాక్యుమెంటరీలో.. కెనడా క్రికెట్ బోర్డులో మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి, ఆటగాళ్లను బెదిరించడం వంటి తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టిన కొద్దిరోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడింది. India లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.
అయితే, బోర్డుపై సస్పెన్షన్ విధించినప్పటికీ కెనడా జాతీయ జట్టు ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. ఆటగాళ్ల ప్రయోజనాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో ఐసీసీ మేనేజ్‌మెంట్ పర్యవేక్షణలో ఒక ప్రత్యేక నియంత్రణ యంత్రాంగం ద్వారా జట్టు నిర్వహణకు అవసరమైన నిధులను విడుదల చేయనున్నారు. క్రికెట్ కెనడా తన పరిపాలనా పరమైన లోపాలను సరిదిద్దుకుని, ఐసీసీ విధించిన నిబంధనలను పూర్తిగా నెరవేర్చిన తర్వాతే తిరిగి సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారు. దీనిని పర్యవేక్షించడానికి ఐసీసీ ఒక నార్మలైజేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కాగా, గత ఏడాది సరిగ్గా ఇలాంటి నిబంధనల ఉల్లంఘనల కారణంతోనే యూఎస్ఏ (USA) క్రికెట్ బోర్డును కూడా ఐసీసీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.