Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
Andhra sentiment in Telangana politics: తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన జూన్ 2వ తేదీ.. తెలుగు నేల చరిత్రలో ఒక మైలురాయి. రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు పూర్తయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి కంటే విడిపోయిన తర్వాతే రెండు రాష్ట్రాలు సాధించిన ప్రగతి, ఎదుర్కొంటున్న రాజకీయ పరిణామాలు ఎవరూ ఊహించనివి. తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి నేటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్థానాన్ని గమనిస్తే.. విభజన అనేది ఆర్థిక వృద్ధికి ఒక పెద్ద బూస్టర్‌గా మారిందని స్పష్టమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు మన మొత్తం జీడీపీ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు కంటే తక్కువగా ఉండేది. కానీ విభజన తర్వాత కథ పూర్తిగా మారింది. తెలంగాణ తన ఐటీ, సర్వీస్ రంగాలతో గ్లోబల్ హబ్‌గా ఎదిగితే.. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్, ఆక్వా, సుదీర్ఘ తీరప్రాంత పారిశ్రామిక వృద్ధిని అందిపుచ్చుకుంది. నేడు రెండు తెలుగు రాష్ట్రాల విడివిడి జీడీపీలను కలిపి చూసినా, లేదా వాటి వృద్ధి రేటును విడివిడిగా పరిగణనలోకి తీసుకున్నా.. పారిశ్రామిక దిగ్గజమైన తమిళనాడును మించిపోవడం విభజన తెచ్చిన అతిపెద్ద ఆర్థిక సానుకూలాంశం. పరిపాలన వికేంద్రీకరణ, ప్రత్యేక బడ్జెట్లు, స్థానిక వనరులపై పట్టు సాధించడం వల్లే ఈ అద్భుత ప్రగతి సాధ్యమైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆర్థిక వృద్ధిలో రెండు రాష్ట్రాలు ఒకేలా దూసుకుపోతున్నప్పటికీ, రాజకీయాల్లో మాత్రం పూర్తిగా భిన్నమైన ధృవాలుగా నిలిచాయి. తెలంగాణ మలిదశ రాజకీయాల్లో జాతీయ పార్టీల హవా స్పష్టంగా కనిపిస్తోంది. పదేళ్ల ప్రాంతీయ పార్టీ పాలన తర్వాత, ప్రజలు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. మరోవైపు ప్రతిపక్షంగా బీజేపీ ఇక్కడ వేగంగా పుంజుకుంటోంది. దీనికి భిన్నంగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దశాబ్ద కాలంగా ప్రాంతీయ పార్టీలదే గుత్తాధిపత్యం. అక్కడ వైఎస్సార్సీపీ , తెలుగుదేశం, జనసేన వంటి ప్రాంతీయ శక్తుల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు అక్కడ క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు సాధించడం ఇప్పటికీ సవాలుగానే మిగిలింది. ఒక రాష్ట్రంలో చక్రం తిప్పే శక్తులు, పక్క రాష్ట్ర సరిహద్దు దాటితే కనీస ప్రభావం చూపలేకపోవడం తెలుగు రాజకీయంలోని విచిత్రమైన పరిణామం. ఒకప్పుడు రాష్ట్రమంతటా ప్రభావం చూపిన టీడీపీ ఏపీకి పరిమితం కాగా.. కాంగ్రెస్ .. తెలంగాణ వరకే ప్రభావం చూపిస్తోంది.