టీటీడీ బ్రహ్మోత్సవాలు: స్వామి వారి రథోత్సవం..రథ సారథులుగా ముగ్గురు సిస్టర్స్ .
ఆలయాలలో బ్రహ్మోత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రతి రోజు వేరు వేరు వాహనాలలో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తుంటారు. అయితే తిరుమల బ్రహ్మోత్సవాలలో జరిగూ రథోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఇదిచాలా కష్టతరమైనదని చెప్పాలి. వాహనాలను అయితే వాహన బేరర్లు మోస్తారు. అదే రథోత్సవంలో స్వామి వారు వేంచేసి యున్న రథాన్ని భక్తులే స్వయంగా లాగుతారు.స్వామి వారి రథ యాత్ర సజావుగా సాగాలంటే రథ సారధుల పాత్ర ఎంతో కీలకం.టీటీడీ బ్రహ్మోత్సవాలలో రథసారధుల పాత్ర ఏంటి..! అందుకు ఎలాంటి నైపుణ్యం కావాలి..! రధం నడపడం అందరికి సాధ్యామా.. ? తెర వెనక రథసారధుల సేవపై స్పెషల్ స్టోరీ..
బ్రహ్మోత్సవాలలో రథోత్సవం అత్యంత కీలక ఘట్టం. తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో వీధులలో భక్తుల సందోహం గోవింద నామస్మరణ మధ్య రథోత్సవం కోలాహలంగా జరుగుతుంది. 70 అడుగులకు పైఎత్తులో, టన్నుల కొద్దీ బరువైన రథంపై స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. రథాన్ని భక్తులు లాగుతూ ఉంటారు. కానీ రథాన్ని నియంత్రించటం ఇక్కడ ఎంతో క్లిష్టతరమైన పని. శక్తి,యుక్తితో సమన్వయం చేసుకోవాలి. దేవుడి ఉత్సవాల సమయంలో .. రథోత్సవాల్లో భారీ రథాన్ని లాగేటప్పుడు, రథం చక్రాల కదలికను నియంత్రించాలి. ‘సరుకు’, వేగాన్ని ఆపే ‘తుండు’, ఎత్తైన మార్గాల్లో చక్రాలను నెట్టే ‘తుండ్లు’ వంటి పరికరాలను సమర్థంగా వినియోగించాలి. ఇంతటి కష్టంతో కూడిన క్లిష్టమైన పనిని తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే రథోత్సవంలో హర్షిణి రెడ్డి, ఖ్యాతి రెడ్డి సిస్టర్స్ ఎంతో సునాయాసంగా సేవలందిస్తున్నారు.
రథం వెనుక భాగంలో ఉండటంతో ముందున్న పరిస్థితులు కనిపించకపోయినా, తండ్రి సూచనలతో సమన్వయం చేసుకుంటూ రథాన్ని అదుపులో ఉంచుతారు. ప్రారంభంలో చేతులు, కాళ్లకు గాయాలు అయినప్పటికీ స్వామి సేవపైనే దృష్టి పెట్టామని తెలిపారు. ముగ్గురు యువతులు ఖ్యాతి శ్రీ రెడ్డి, హర్షిణి రెడ్డి, మోహితారెడ్డి తమ వృత్తుల్లో డాక్టర్, ఇంజినీర్, చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నప్పటికీ, శ్రీ వేంకటేశ్వరుడి సేవను జీవితంలో అత్యున్నత గౌరవంగా భావిస్తున్నారు. వీధుల్లో రథాన్ని ముందుకు నడిపించడం భక్తి పరంగా మాత్రమే కాకుండా, ధైర్యం, శ్రమకు కూడా ఒక ప్రతీక. రథాన్ని నియంత్రించడం అంటే మహిళలకు కష్టమైన పని అని అనేవారికి ఈ అక్కా చెల్లెళ్ళు ధీటుగా సమాధానమిస్తున్నారు..