Select Location
All Locations
State
Region
City / District
ఎవరీ రాజేష్ మెహతా.. గ్లోబల్ గోల్డ్ కింగ్ చరిత్ర ఏంటీ..? సెబీ ఆరోపణలపై అతని మాటేంటి?

ఎవరీ రాజేష్ మెహతా.. గ్లోబల్ గోల్డ్ కింగ్ చరిత్ర ఏంటీ..? సెబీ ఆరోపణలపై అతని మాటేంటి?

భారతీయ వ్యాపార రంగంలో జీరో నుంచి సామ్రాజ్యాన్ని నిర్మించిన సక్సెస్ స్టోరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ‘రాజేష్ ఎక్స్‌పోర్ట్స్’ అధినేత రాజేష్ మెహతా ప్రయాణం కూడా ఒకటి. కేవలం 12 వందల రూపాయల అప్పుతో మొదలైన ఆయన ప్రయాణం.. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనింగ్ సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగేలా చేసింది. అయితే దశాబ్దాల పాటు వెలిగిపోయిన ఆ బంగారు కిరీటం ప్రస్తుతం సెబీ ఉచ్చులో చిక్కుకుంది.

రాజేష్ జస్వంత్ రాయ్ మెహతా 1964 జూన్ 20న బెంగళూరులో ఒక సామాన్య మధ్యతరగతి జైన్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జస్వంత్ రాయ్ మెహతా గుజరాత్ లోని మోర్బీ ప్రాంతం నుండి 1946లో బెంగళూరుకు వలస వచ్చారు. మొదట్లో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసిన ఆయన.. ఆ తర్వాత రత్నాలు ట్రేడింగ్ చేస్తూ ‘రాజేష్ డైమండ్ కంపెనీ’ని ప్రారంభించారు. రాజేష్ మెహతా బెంగళూరులోనే చదువుకున్నారు. నిజానికి ఆయన డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. అయితే ఫ్యామిలీ పరిస్థితుల వల్ల తండ్రి వ్యాపారంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది.

రాజేష్ మెహతా తన వ్యాపార ప్రయాణాన్ని చాలా వినూత్నంగా ప్రారంభించారు. తన అన్నయ్య బిపిన్ దగ్గర రూ.1,200 అప్పుగా తీసుకుని వెండి ఆభరణాల ట్రేడింగ్ మొదలుపెట్టారు. చెన్నై నుంచి వెండి నగలు కొని, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న తమ బంధువులకు లాభానికి అమ్మేవాడు. అక్కడ వచ్చిన డబ్బుతో మళ్లీ గుజరాత్ వెండి డిజైన్లను కొని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో హోల్‌సేలర్లకు అమ్మేవాడు. రాజేష్ ఆర్ట్ జ్యువెలర్స్ పేరుతో వస్తుమార్పిడి పద్ధతిని ప్రవేశపెట్టి ప్రతి బిజినెస్ సైకిల్‌లోనూ 50% లాభాలను ఆర్జించాడు.

వెండి వ్యాపారంలో పట్టు సాధించాక.. 1989లో రాజేష్ మెహతా తన సోదరుడు ప్రశాంత్ మెహతాతో కలిసి బెంగళూరులోని ఒక చిన్న గ్యారేజీలో 10 మంది కార్మికులతో గోల్డ్ జ్యువెలరీ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. అదే ‘రాజేష్ ఎక్స్‌పోర్ట్స్’. దేశంలోనే మొట్టమొదటి ఆర్గనైజ్డ్ గోల్డ్ జ్యువెలరీ తయారీ, R&D కేంద్రాన్ని వీరు స్థాపించారు. 1995లో ఈ కంపెనీ షేర్ మార్కెట్లో లిస్ట్ అయింది. 2015లో స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ ‘వాల్‌కాంబీ’ని కొనుగోలు చేయడంతో రాజేష్ మెహతా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఒక దశలో ప్రపంచంలోని మొత్తం బంగారంలో 35% వీరే ప్రాసెస్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించుకుంది.


V6 News 1 hour ago
Home Flash News