NRIలకు టీటీడీ తీపికబురు.. సుపథం దర్శన గడువు 90 రోజులకు పెంపు!
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆశించే ప్రవాస భారతీయులకు (NRIs) తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే - TTD) తీపి కబురు అందించింది. సుపథం మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రస్తుతం ఉన్న గడువు పరిమితిని 30 రోజుల నుంచి ఏకంగా 90 రోజులకు పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఆర్‌ఐల సౌకర్యార్థం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటివరకు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం... ప్రవాస భారతీయులు భారతదేశానికి వచ్చిన 30 రోజుల్లోపు తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్, ఒక సెట్ జిరాక్స్ కాపీతో తిరుమలలోని సుపథం మార్గం వద్దకు చేరుకోవాల్సి ఉండేది.
అక్కడ అధికారులు పాస్‌పోర్ట్‌ను పరిశీలించిన అనంతరం ఒక్కొక్కరికి రూ.300 చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన (Special Entry Darshan) టికెట్లను జారీ చేసేవారు. అయితే, స్వదేశానికి వచ్చిన చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు తమ సొంత పనులు, ప్రయాణాల బిజీ వల్ల 30 రోజుల వ్యవధిలో తిరుమలకు చేరుకోలేక ఇబ్బందులు పడేవారు. ఈ కాలపరిమితిని పెంచాలని భక్తుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో స్పందించిన టీటీడీ పాలకమండలి, గడువును 30 రోజుల నుంచి 3 నెలల (90 రోజులు) వరకు పొడిగించింది.