సర్పై అనుమానాలున్నయ్..టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మీద చాలా అనుమానాలున్నాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇతర దేశాల వాళ్లకు మన దేశంలో ఓట్లు ఉండొద్దనడం మంచిదేనని, మరి ఇతర రాష్ట్రాల వాళ్లు ఒక్కొక్కరూ రెండు మూడు రాష్ట్రాల్లో ఓటు వేయొచ్చా అని ప్రశ్నించారు.
ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్ల ఏరివేతకు ఈసీ వద్ద ఉన్న మెకానిజం ఏంటో చెప్పాలన్నారు. ఈ డూప్లికేషన్ ఓట్లను కంట్రోల్ చేయకపోతే ఎస్ఐఆర్ తో ఎలాంటి యూజ్ లేదన్నారు. సోమవారం బంజారాహిల్స్ లోని పార్టీ ఆఫీస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రాసెస్‌లో భాగంగా తన నియోజకవర్గమైన బోధన్‌లో ఏడు వేల ఓట్లను తొలగించిన విషయం తెలిసిందని కవిత చెప్పారు. అసలు ఈ ఏడు వేల ఓట్లు షిఫ్ట్ అయ్యాయా? వాళ్లు చనిపోయారా? ఏంటన్న రీజన్ మాత్రం ఈసీ చెప్పడం లేదని విమర్శించారు. ఒక నియోజకవర్గంలో 2 శాతానికి మించి ఓట్లు తొలగించాలంటే ఎవరివైతే ఓట్లు తొలగిస్తారో వారికి మూడు సార్లు నోటీసులు ఇవ్వాలని ఈసీ రూల్స్ లోనే ఉందని గుర్తు చేశారు. 7 వేల ఓట్లు అంటే అవి ఒక కాండిడేట్ విజయాన్ని డిసైడ్ చేసే పెద్ద మొత్తం ఓట్లన్నారు. అదే టైంలో 2018 నుంచి 2023 నాటి ఎలక్షన్స్ వరకు కొడంగల్‌లో 30 వేల కొత్త ఓట్లు వచ్చి చేరాయని చెప్పారు.
అక్కడ దాదాపుగా 22 వేలకుపైగా ఓట్లు డూప్లికేట్ ఉన్నాయన్నారు. కర్నాటకకు చెందిన సెడం నియోజకవర్గంలోని 11 వేల ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో రిజిస్టర్ అయి ఉన్నాయని, అంటే దాదాపుగా 33 వేల ఓట్లు అక్రమంగా ఉంటే అక్కడ కేవలం 800 ఓట్లు మాత్రమే తొలగించారని చెప్పారు. రేవంత్ రెడ్డి మొన్నటి ఎలక్షన్స్‌లో 32 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని, పక్క రాష్ట్రం ఓట్లే రేవంత్ రెడ్డిని గెలిపించినట్లు అర్థమవుతోందన్నారు. బోధన్‌లో ఏడు వేల ఓట్లు తొలగిస్తే.. కొడంగల్‌లో మాత్రం 800 ఓట్లు మాత్రమే ఎందుకు డిలీట్ చేశారని అడిగారు. ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్ల సంగతేంటి? అసలు ఎస్ఐఆర్ ప్రాసెస్‌కు ప్రయోజనం ఉండాలంటే మెయిన్‌గా ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను తొలగించాలని కవిత చెప్పారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన దేశంలో ఇతర దేశస్తులకు ఓట్లు ఉండవద్దని చెబుతున్నారని, దాన్ని తాము వెల్‌కమ్ చేస్తున్నామన్నారు. కానీ ఒక పర్సన్‌కు రెండు మూడు రాష్ట్రాల్లో ఓటు ఉండవచ్చా అని ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్ లాంటి యాక్టర్‌కు రెండు మూడు స్టేట్ లలో ఓటు హక్కు ఉంటే వాటిని తొలగించేందుకు ఏడేళ్లు పట్టిందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల ఓట్లను తొలగించకపోతే ఇతర దేశస్తులు ఒక రాష్ట్రంలో సర్జరుగుతుంటే మరో రాష్ట్రంలో వాళ్ల ఓట్లను నమోదు చేసుకోరా అని ప్రశ్నించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓట్ అనే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. సర్ కోసం సాధారణంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి రిఫరెన్స్ పాయింట్ తీసుకోవాల్సి ఉండగా ఈసీ మాత్రం గతేడాది జనవరి 1 నుంచి రిఫరెన్స్ పాయింట్ తీసుకుందని అన్నారు.