ఓటు తొలగిస్తే పౌరసత్వం రద్దయినట్టు కాదు: సుప్రీంకోర్టు
'SIR' ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించినంత మాత్రాన పౌరసత్వం రద్దయినట్టు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా.. పౌరసత్వంపై అనుమానంతో ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగించబడిన వారికి రేషన్ సహా ఇతర సామాజిక సంక్షేమ పథకాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిలిపివేస్తోందంటూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై సమాధానం చెప్పాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి (EC) శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్‌పర్సన్, 'జాయింట్ ఫోరమ్ ఎగైనెస్ట్ ఎన్నార్సీ' కన్వీనర్ ప్రసేన్‌జిత్ బోస్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి పౌరసత్వంపై సందేహాలుంటే ఓటరు జాబితా నుండి పేరును తొలగించే రాజ్యాంగబద్ధమైన అధికారం ఎన్నికల సంఘానికి ఉందని.. కానీ, ఒక వ్యక్తి భారత పౌరుడా కాదా అని నిర్ణయించే అధికారం దానికి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో జరిగిన ఇలాంటి ప్రక్రియల సందర్భంలోనూ తాము ఇదే విషయాన్ని స్పష్టం చేశామని న్యాయస్థానం గుర్తుచేసింది. సందేహాస్పద పౌరసత్వం ఉన్నవారి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని తాము ఎన్నికల సంఘానికి సూచించామని, పౌరసత్వాన్ని నిర్ణయించే సమర్థవంతమైన అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని పేర్కొంది.
పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కోర్టుకు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు 33 లక్షల మంది అప్పీలేట్ ట్రిబ్యునళ్లలో అప్పీళ్లు దాఖలు చేశారని తెలిపారు. అయితే, ఇప్పటివరకు కేవలం 30,000 అప్పీళ్లను మాత్రమే ట్రిబ్యునళ్లు పరిష్కరించాయని, అందులో 70 శాతం అప్పీళ్లు ఓటరుకు అనుకూలంగా వచ్చాయని, అంటే వారి పేర్లను తిరిగి ఓటరు జాబితాలో చేర్చాల్సి ఉందని కోర్టుకు వివరించారు. కేవలం 1 శాతం అప్పీళ్లు మాత్రమే ఇప్పటివరకు పరిష్కారం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, ఎన్నికల సంఘం తీసుకున్న తాత్కాలిక నిర్ణయాన్ని తుది నిర్ణయంగా పరిగణిస్తూ.. అర్హులకు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS), అన్నపూర్ణ యోజన కింద అందాల్సిన ఉచిత బియ్యం, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రభుత్వం నిలిపివేస్తోందని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అప్పీళ్లు దాఖలు చేసిన వారికి రేషన్, అన్నపూర్ణ పథకాల ప్రయోజనాలు అందుతాయని గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, ఆచరణలో అలా జరగడం లేదన్నారు. అంతేకాకుండా, ఓటరు జాబితా నుండి పేర్లు తొలగించబడిన వారి కుల ధృవీకరణ పత్రాలను కూడా పునఃపరిశీలించి రద్దు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పీళ్ల వేగవంతమైన పరిష్కారం కోసం కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించాలని సూచించిన సుప్రీంకోర్టు, మిగిలిన అంశాలపై విచారణను స్వీకరిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది.