Select Location
All Locations
State
Region
City / District
గ్రామ పంచాయతీలకు నిధులు, ధరణిపై సిట్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలివే

గ్రామ పంచాయతీలకు నిధులు, ధరణిపై సిట్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలివే

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు 1.రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పంటల సాగు వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభావం, తాగునీరు సాగునీటి ఇబ్బందులు, ఉపాధి కూలీల పరిస్థితులను సమగ్రంగా వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని, ఎల్‌నినో కంటింజెన్సీ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 40 శాతం వర్షపాతం లోటు ఉంది. తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరాపై వెంటనే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నందున, అన్ని శాఖలు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు చేసే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన విద్యుత్తు ఉత్పత్తితో పాటు కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని నిర్ణయించింది. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగును రైతులు నివారించి, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు కేబినేట్ విజ్ఞప్తి చేసింది.

ఎల్ నినో ప్రభావంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించింది. రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి గారి సారథ్యంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక నివేదిక రూపొందించాలని మంత్రివర్గం సూచించింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు అనుకూలమైన పంటలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటలతో పాటు పశువుల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలతో నివేదిక అందించాలని కోరింది.


Smacy News 52 minutes ago
Home Flash News