బతుకమ్మకుంట వివాదం: తేల్చాల్సింది హైకోర్టే.. 'హైడ్రా' పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
హైదరాబాద్: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట వద్ద హైడ్రా ఏర్పాటు చేసిన గేటు, ఫెన్సింగ్, రక్షణ గోడ కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్మాణాలను అనుమతించాలా వద్దా అనే అంశాన్ని నిర్ణయించే బాధ్యతను తెలంగాణ హైకోర్టుకే అప్పగించింది. స్థానిక పరిస్థితులపై హైకోర్టుకే పూర్తి అవగాహన ఉంటుందని, కాబట్టి ఈ నిర్మాణాలు చట్టబద్ధంగా సమర్థనీయమేనా కాదా అనే విషయాన్ని ఆ కోర్టే విశ్లేషించి తేల్చుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీలా నాగులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వివాదం బతుకమ్మ కుంట వద్ద హైడ్రా చేపట్టిన నిర్మాణాలకు సంబంధించింది. గతంలో బతుకమ్మ కుంట విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించినప్పటికీ.. హైడ్రా అక్కడ గేటు, ఫెన్సింగ్, రక్షణ గోడను నిర్మించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ పిటిషనర్ సుధాకర్ రెడ్డి.. హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నాలుగు వారాల్లోగా ఆ నిర్మాణాలను తొలగించాలని హైడ్రాను ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా.. తాము హైకోర్టు ఆదేశాలను ప్రధానంగా అమలు చేశామని, ఇందుకు సంబంధించిన అనుపాలన అఫిడవిట్ సమర్పించామని హైడ్రా తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే, చెరువు రక్షణ దృష్ట్యా అక్కడ ఏర్పాటు చేసిన గేటు, ఫెన్సింగ్, రక్షణ గోడను అలాగే ఉంచేందుకు అనుమతించాలని హైడ్రా సుప్రీంకోర్టును కోరింది. ఆ నిర్మాణాలు అక్కడ కొనసాగాలా వద్దా అనే విషయాన్ని తాము పరిశీలించబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న హైకోర్టే దీనిపై నిర్ణయం తీసుకోవడం సరైనదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో హైడ్రా దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు పరిష్కరించింది. బతుకమ్మ కుంటకు సంబంధించిన ప్రధాన కేసుతో పాటు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కూడా కలిపి విచారించాలని, ఈ రెండు అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ విచారణలో సుప్రీంకోర్టులో హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.