Select Location
All Locations
State
Region
City / District
Hydraa | హైడ్రా.. పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hydraa | హైడ్రా.. పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hydraa | ప్రజలు హైడ్రా పేరు వింటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. రెవెన్యూ, ఇరిగేషన్‌ వంటి కీలక శాఖలు నిర్వీర్యం అయ్యాయని, చివరికి పోలీసులు సైతం హైడ్రాకు వినతిపత్రాలు ఇస్తున్నారని విస్మయం వ్యక్తంచేసింది

Hydraa | హైదరాబాద్‌, జూలై 24 (నమస్తే తెలంగాణ): ప్రజలు హైడ్రా పేరు వింటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. రెవెన్యూ, ఇరిగేషన్‌ వంటి కీలక శాఖలు నిర్వీర్యం అయ్యాయని, చివరికి పోలీసులు సైతం హైడ్రాకు వినతిపత్రాలు ఇస్తున్నారని విస్మయం వ్యక్తంచేసింది

ఒక వ్యక్తికి ఇంతటి అసాధారణ అధికారాలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల చట్టాలను రద్దు చేసి, అన్ని ప్రభుత్వ శాఖలను మూసివేసి, ‘హైడ్రా’ అనే ఒకే ఒక చట్టం అమలు చేస్తే సరిపోతుందని ధర్మాసనం తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. మేడ్చల్‌ -మలాజిగిరి జిల్లా మలాజిగిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నంబర్‌ 1, 2 లోని 40 ఎకరాల భూమిలో హైడ్రా కూల్చివేతలపై శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ దాఖలు చేసిన కోర్టు ధికరణ కేసులో శుక్రవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌ మరోసారి హైడ్రాపై నిప్పులు చెరిగారు. ఒకే కేసులో ఏకంగా మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలైనా, హైకోర్టు ఒకదాని తర్వాత మరొక ఉత్తర్వులు జారీచేసినా హైడ్రా పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. శుక్రవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో కనీసం ఒక్కసారైనా క్షమాపణ కోరకపోవడం విస్మయాన్ని కలిగించిందని పేర్కొన్నారు. సాధారణంగా కోర్టు ధిక్కరణ కేసుల్లో బేషరతు క్షమాపణలు చెప్పడం న్యాయ ప్రక్రియలో జరుగుతుందని, కానీ హైడ్రా దానికి అతీతమన్నట్టుగా వ్యవహరిస్తున్నదని ఆక్షేపించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు బేషరతుగా క్షమాపణ కోరుతూ సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టంచేశారు. ఇకపై వివాదాస్పద స్థలంలోకి హైడ్రా ప్రవేశించదని స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 18న ఏ కారణాలతో పిటిషనర్‌కు చెందిన స్థలంలోకి ప్రవేశించాల్సి వచ్చిందో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. కేవలం అడ్వొకేట్‌ జనరల్‌ వచ్చి కోరినందునే మిలిటరీ యాక్షన్‌ తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను నిలిపివేస్తున్నామని చెప్పారు.

ఇతర చట్టాలను రద్దు చేయండి విచారణ సందర్భంగా హైడ్రా అధికార పరిధిపై న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించి ఉకిరిబికిరి చేశారు. హైడ్రాకు కల్పించిన అసాధారణ అధికారాలను చూస్తుంటే తనకు మాటలు చాలడం లేదని వ్యాఖ్యానించారు. ఒక ప్రభుత్వ జీవోతో ఏర్పాటైన సంస్థ అన్ని శాఖలకు చట్టబద్ధంగా వచ్చిన అధికారాలను బైపాస్‌ చేసి, పెత్తనం చెలాయిస్తున్నదని ఆక్షేపించారు. రెవెన్యూ చట్టంలోని 6, 7 సెక్షన్ల ప్రకారం భూ ఆక్రమణలపై చర్యలు తీసుకొనే స్పష్టమైన అధికారాలు రెవెన్యూ శాఖకు ఉన్నాయని స్పష్టంచేశారు. అలాంటప్పుడు ఆయన (హైడ్రా కమిషనర్‌) అక్కడేం చేస్తున్నారని నిలదీశారు. ‘ఆయనే ఒక చట్టమా? రెవెన్యూ శాఖ, ఇరిగేషన్‌ శాఖ.. ఇలా ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికే వెళ్తున్నారు. ఎందుకు?’ అని ప్రశ్నించారు. చివరికి పోలీసులు కూడా హైడ్రాను ఆశ్రయించే దుస్థితి ఎందుకు వచ్చిందని, ఈ పరిస్థితిని ఎవరు కల్పించారని ప్రశ్నించారు. ప్రభుత్వ చట్టాలతో పని లేకుండా హైడ్రానే అన్నీ చేస్తుంది.. చేయాలి.. అనుకుంటే మిగిలిన అన్నీ ప్రభుత్వ శాఖలు ఎందుకని, ఆయా చట్టాలను రద్దు చేసి, హైడ్రానే ఒక చట్టంగా చేస్తే సరిపోతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. భూమికి రక్షణ కల్పించాలని కోరుతూ రక్షణ శాఖ అధికారులు తమకు వినతిపత్రం అందించారని హైడ్రా చేసిన వాదనను న్యాయమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు.


24 News 1 hour ago
Home Flash News