కృష్ణా ట్రిబ్యునల్ అవార్డుపై స్టే యథాతథం
కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించిన అవార్డుపై అమల్లో ఉన్న స్టేను తొలగించాలని కర్ణాటక సర్కార్ చేసిన వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించిన అవార్డుపై అమల్లో ఉన్న స్టేను తొలగించాలని కర్ణాటక సర్కార్ చేసిన వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రత్యేకంగా త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, సదరు పిటిషన్ విచారణను సెప్టెంబర్ నుంచి చేపడుతామని ధర్మాసనం ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా నదీ జలాల్లో వాటాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్-1 సూచనల మేరకు గత అవార్డును సమీక్షించేందుకు కేంద్రం 2004లో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలో ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ-2)ను ఏర్పాటు చేసింది. ఆ ట్రిబ్యునల్ 65% డిపెండబులిటీ కింద, సగటు ప్రవాహాల ఆధారంగా కృష్ణానదిలో 2,578 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని లెక్కతేల్చింది. ట్రిబ్యునల్-1 కేటాయించిన 2,130 టీఎంసీలను మినహాయించి, మిగిలిన 448 టీఎంసీలను మూడు రాష్ర్టాలకు పంచింది. మహారాష్ట్రకు 81 టీఎంసీలు, కర్ణాటకకు 173 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీల చొప్పున కేటాయించింది. అవార్డు డ్రాఫ్ట్‌ను 2010లో, తుది అవార్డును 2013 లో కేడబ్ల్యూడీటీ-2 నివేదించింది. ట్రిబ్యునల్ తీర్పుపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉమ్మడి ఏపీతోపాటు, మిగిలిన రాష్ర్టాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అవార్డును నోటిఫై చేయకుండా సుప్రీంకోర్టు స్టే విధించింది.Geographic Reference
స్టే ఎత్తివేతకు తిరస్కరణ స్టేను తొలగించాలని కోరుతూ రెండేండ్ల క్రితం కర్ణాటక సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సైతం ఇంప్లీడ్ అయ్యాయి. సదరు పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యబాగ్చి, జస్టిస్ మోహనతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. తొలుత కర్ణాటక సర్కార్ వాదనలను వినిపించింది. ట్రిబ్యునల్-2 అవార్డు ప్రకారం తమకు 173 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, ఇప్పటికే రూ.29వేల కోట్లకుపైగా నిధులను వెచ్చించామని తెలిపింది. అవార్డు అమల్లోకి రాకపోవడంతో నీళ్లను వినియోగించుకోలేకపోతున్నామని, స్టే ఉత్తర్వులను సవరించాలని, అవార్డును గెజిట్ నోటిఫికేషన్ అనుమతివ్వాలని వేడుకున్నది. కర్ణాటక వాదనలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు. పిటిషన్‌లో అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి సాంకేతిక, న్యాయపరమైన అంశాలు, ఏపీ, తెలంగాణ అప్పీళ్లు సైతం ఉన్నాయని గుర్తుచేసింది. స్టేను ఎత్తివేయడం సాధ్యంకాదని స్పష్టంచేసింది. పిటిషన్‌ను పూర్తిస్థాయిలో విచారించాలని, అందుకు తగిన త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, సెప్టెంబర్ మొదటి వారం నుంచి విచారణ చేపడుతామని వెల్లడించింది. ట్రిబ్యునల్ అవార్డుపై స్టే యథాతథంగా కొనసాగుతుందని స్పష్టంచేసింది