Select Location
All Locations
State
Region
City / District
ఇండ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలి: గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్

ఇండ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలి: గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్

మహబూబ్ నగర్ కలెక్టరేట్/వనపర్తి, వెలుగు: డబుల్ బెడ్​రూమ్, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి కలెక్టరేట్​ లో గృహనిర్మాణ, రెవెన్యూ,మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్​రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని, రెండు పథకాల లబ్ధిదారుల జాబితాలను ఏఐ సాయంతో సరిపోల్చి రెండు స్కీమ్​లలో ఒక్కరే లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆశా వర్కర్లు, అంగన్​వాడీ సిబ్బందిని కేవలం ఉద్యోగం ఆధారంగా అనర్హులుగా ప్రకటించరాదని, వారి కుటుంబ పరిస్థితులు, ఆదాయాన్ని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సమావేశానికి ముందు ఏనుగొండలోని మౌలాలి గుట్టలో నిర్మించిన డబుల్ బెడ్​రూమ్ గృహాలను ఆయన పరిశీలించారు. ఖాళీగా ఉన్న ఇండ్లను వెంటనే అర్హులకు కేటాయించి తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ గృహాల రెండో దశ అమలులో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు తప్పనిసరిగా తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. గోడలు బాగుండి పైకప్పు దెబ్బతిన్న ఇండ్లకు రూ.2 లక్షల 'రూఫ్ రీప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్' ఆర్థిక సహాయంపై గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. జడ్చర్లలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్​రూమ్ ఇండ్లపై ప్రత్యేక సమీక్ష జరిపి, కాంట్రాక్టర్ల చెల్లింపులు, పెండింగ్ బకాయిలపై ఆరా తీశారు. అవసరమైతే పాత కాంట్రాక్టు రద్దు చేసి కొత్త వారికి పనులు అప్పగించాలని, ఇండ్లు కేటాయించినప్పటికీ తాళాలు వేసి వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


V6 News 1 hour ago
Home Flash News