తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కాదుగా..: టీమ్ఇండియా ఎంపికపై కైఫ్
ఇంటర్నెట్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 తుది జట్టు ఎంపికపై మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ( Mohammad Kaif) అసహనం వ్యక్తం చేశాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన సీమర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar)ను మూడు మ్యాచ్‌లకే తప్పించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. ప్రస్తుత భారత బౌలర్ల ఎకానామీ భారీగా ఉందని.. జట్టు యాజమాన్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నాడు.
‘‘భువీని నాలుగో టీ20 నుంచి డ్రాప్ చేయడంతో నేను ఆశ్చర్యపోయాను. భారత్-న్యూజిలాండ్‌లో కలిపి 10 నుంచి 11 మంది బౌలర్లు ఉన్నారు. అందరి ఎకానమీలు భారీగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ క్రమంలో భువీని ఎందుకు డ్రాప్ చేశారో నాకు అర్థంకాలేదు. ఈ పరిస్థితుల్లో అతడు ఒక్కడినే తీసుకోలేరా..?
అతడు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు. మరోవైపు సిరీస్ ఇప్పటికే గెలిచాం. మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా.. తాడోపేడో తేల్చుకునే మ్యాచ్‌లేమీ లేవు. జట్టు నిర్ణయంతో నేను ఏకీభవించను. అతడికి సిరీస్ మొత్తంలో అవకాశాలు దక్కాల్సింది. మీకు అతడి సామర్థ్యం తెలుసు. అలాంటప్పుడు రెండు మూడు మ్యాచుల్లో పేలవంగా ఆడినా అండగా ఉండాలి. జట్టులో బుమ్రా ఎలాగూ లేడు.. ఉన్నవాళ్లంతా కొత్తవారే. అతడు అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో అందరూ కొంత నిరాశ చెందిన మాట వాస్తవమే. భువీ కూడా ఇదే విషయం గ్రహించి ఉంటాడని నమ్మకంగా చెప్పగలను. వాస్తవానికి మిగిలిన బౌలర్లు కూడా పరుగులు సమర్పించుకున్నారు. ఐదు మ్యాచుల్లో అతడికి అవకాశం ఇచ్చాక విశ్లేషించి ఉండాల్సింది. తొందరపాటు నిర్ణయం తీసుకొన్నారు’’ అని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.