సూర్య కొత్త సినిమా టైటిలిదే.. ఫస్ట్‌లుక్ చూశారా!
ఇంటర్నెట్ డెస్క్: సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. నేడు ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘సూర్య 46’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath And Sons) అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. సూర్య (Suriya) చిన్న బాబును ఎత్తుకొని పాల డబ్బాతో ఉన్న ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా ఇది రానున్నట్లు వెల్లడించారు. ఈ జులైలో దీన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
‘లక్కీ భాస్కర్’ వంటి హిట్ సినిమా తర్వాత వెంకీ దర్శకత్వంలో రానున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను సూర్య వింటేజ్ లుక్ రెట్టింపు చేసింది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తున్నారు. రవీనాటాండన్, రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.