మరింత భీకర దాడి చేస్తాం: ట్రంప్
ఇరాన్‌లో చెత్తను ఏరేస్తున్నామని, మరింత భీకరంగా దాడులు చేయబోతున్నామని, ప్రజలు బయటకు రావొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే భూతల పోరాటం చేస్తామని, ఇరాన్‌కు సైన్యాన్ని పంపుతామని తెలిపారు. యుద్ధం నాలుగైదు వారాలు కొనసాగుతుందని భావిస్తున్నామని, అయితే మరింత కాలం సాగవచ్చని అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన పలు మీడియా సంస్థలతో విడివిడిగా, శ్వేతసౌధంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ‘ఇరాన్‌పై ఆపరేషన్‌లో ఒక విషయం స్పష్టం. ఆ దేశ క్షిపణి సామర్థ్యాన్ని ధ్వంసం చేయడమే. నౌకాదళాన్ని నాశనం చేయడమే. అణ్వాయుధాలు తయారుచేయకుండా అడ్డుకోవడమే. ఇరాన్‌పై మరింత భారీ దాడులను ఇంకా ప్రారంభించలేదు. త్వరలో ఆ పని చేస్తాం’ అని ట్రంప్ తెలిపారు.
‘యుద్ధం ఒక నెలపాటు కొనసాగుతుందని భావిస్తున్నా. ఎక్కువ కాలం కొనసాగించాలని కోరుకోవడం లేదు. గల్ఫ్‌లోని ఖతార్, యూఏఈ వంటి దేశాలపై ఇరాన్ దాడులు ఆశ్చర్యపరుస్తున్నాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు.
‘నేలపై బూట్లను మోహరించే విషయంలో సందేహం లేదు (భూతల పోరుపై). అసలు అలాంటిది జరగబోదని ప్రతి అధ్యక్షుడు చెప్పినట్లు నేను చెప్పను. వాటి అవసరం ఉండకూడదనే అనుకుంటున్నా. అవసరమైతే మాత్రం వెనుకాడను’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై దాడుల అంశంలో ఆందోళన లేదని, సరైన పనే చేస్తున్నానని తెలిపారు. రాయిటర్స్, ఇప్సోస్ వారాంతపు పోల్‌లో ఇరాన్‌పై ట్రంప్ దాడిని 43శాతం మంది వ్యతిరేకించారు. దీనిపైనా ట్రంప్ స్పందించారు. ‘పోలింగ్ తక్కువగా ఉన్నా నేను పట్టించుకోను. అది మంచిదే. కానీ పిచ్చివాళ్లు పరిపాలిస్తున్న ఇరాన్‌ను అలా వదిలేయలేం. వారివద్ద అణ్వాయుధం ఉంది. ఇరాన్‌పై దాడులను ప్రజలు హర్షిస్తున్నారు. నిజమైన పోల్ పెడితే మెజారిటీ తప్పకుండా వస్తుంది’ అని స్పష్టం చేశారు.
ఇరాన్‌పై దాడి చేసేందుకు వీలుగా హిందూ మహా సముద్రంలో ఉన్న డిగో గార్షియా దీవిని ఉపయోగించుకునే ప్రతిపాదనకు అనుమతిపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆలస్యం చేయడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. కీర్ మనసు మార్చుకోవడానికి చాలా సమయం తీసుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మా దేశాలకు ఇదివరకెన్నడూ రాలేదని స్పష్టం చేశారు.