ముదురుతున్న యుద్ధం.. అజర్‌బైజాన్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో మండుతున్న యుద్ధజ్వాలలు ఇప్పుడు పొరుగు దేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. మార్చి 5, 2026న ఇరాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు అజర్‌బైజాన్ భూభాగంలోని ఒక విమానాశ్రయంపై దాడి చేయడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుకున్నాయి.
గురువారం మధ్యాహ్నం సమయంలో ఇరాన్ సరిహద్దుల నుంచి వచ్చిన రెండు డ్రోన్లు అజర్‌బైజాన్ ఎక్స్‌క్లేవ్ అయిన 'నఖ్చివన్' ప్రాంతంలోకి చొరబడ్డాయి. వీటిలో ఒకటి నేరుగా నఖ్చివన్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ఢీకొట్టింది. మరో డ్రోన్ సమీపంలోని షెకరాబాద్ గ్రామంలో ఉన్న ఒక పాఠశాల వద్ద పేలిపోయింది. ఈ ఘటనలో విమానాశ్రయ భవనం పాక్షికంగా దెబ్బతినగా.. ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు.
అజర్‌బైజాన్ ఆగ్రహం..
ఈ దాడిని అజర్‌బైజాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బాకులోని ఇరాన్ రాయబారిని పిలిపించి అజర్‌బైజాన్ విదేశాంగ శాఖ గట్టి నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగిన ఈ దాడికి ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తమ భూభాగంపై జరిగిన ఏ దాడికైనా తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని అజర్‌బైజాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న 'ఆపరేషన్ రోరింగ్ లయన్' యుద్ధం కారణంగా ఈ ప్రాంతమంతా అస్థిరంగా ఉంది. ఇజ్రాయెల్‌కు అజర్‌బైజాన్ సన్నిహిత మిత్రదేశం కావడం, ఇజ్రాయెల్ ఆయుధాలను వాడటం ఇరాన్‌కు ఆగ్రహం కలిగిస్తోంది. తమపై జరుగుతున్న దాడులకు అజర్‌బైజాన్ సహకరిస్తోందన్న అనుమానంతోనే ఇరాన్ ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా ఉద్రిక్తతల తర్వాత అజర్‌బైజాన్ తర్వాతి అడుగు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.