సైనిక ఘర్షణల ద్వారా సమస్యలను పరిష్కరించలేం: ప్రధాని మోదీ
ఇంటర్నెట్ డెస్క్: సైనిక ఘర్షణల ద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లలో యుద్ధాలకు త్వరగా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. భారత్ పర్యటనలో ఉన్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో చర్చలు నిర్వహించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ఇటీవల ఈయూతో కుదుర్చుకున్న ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’.. భారత్, ఫిన్లాండ్‌ల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు.‘‘భారత్, ఫిన్లాండ్‌లకు చట్టబద్ధ పాలన, చర్చలు, దౌత్యమార్గాలపై విశ్వాసం ఉంది. కేవలం సైనిక ఘర్షణల ద్వారా సమస్యలను పరిష్కరించలేం. అది ఉక్రెయిన్, లేదా పశ్చిమాసియా.. ఏదైనా కావచ్చు. వివాదాలను వీలైనంత త్వరగా ముగించేందుకు, శాంతిని నెలకొల్పేందుకు చేసే ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇస్తూనే ఉంటాం’’ అని మోదీ (Narendra Modi) తెలిపారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఫిన్లాండ్ అధ్యక్షుడితో చర్చల్లో భాగంగా ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘‘ఏఐ నుంచి 6జీ వరకు, క్లీన్ ఎనర్జీ నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకు అనేక హైటెక్ రంగాల్లో పరస్పర సహకారానికి కట్టుబడి ఉన్నాం’’ అని చెప్పారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం భారత్‌కు వచ్చారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టారు.