Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Chandrababu: ఏపీ వృద్ధాప్యం దిశగా వెళ్తోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాను పెంచేందుకు ప్రోత్సాహకాల డ్రాఫ్ట్ ను ఆయన అసెంబ్లీలో వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జనాభా నిర్వహణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక ప్రసంగం చేశారు. గతంలో కుటుంబ నియంత్రణ కు ప్రాధాన్యత ఇచ్చామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే 2047 నాటికి రాష్ట్రం వృద్ధాప్య సమస్యను ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ, జనాభా సమతుల్యతను కాపాడుకోవడానికి సరికొత్త పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ'ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
వృద్ధాప్యం దిశగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం 1.5 శాతానికి పడిపోయిందని సీఎం వెల్లడించారు. సుస్థిర ప్రగతి సాధించాలంటే ఈ రేటు కనీసం 2.1 ఉండాలని ఆయన స్పష్టం చేశారు. 1992లో 3 శాతంగా ఉన్న ఈ రేటు, ఇప్పుడు సగానికి పడిపోయిది. 2023 లెక్కల ప్రకారం ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు పుడుతున్నప్పటికీ, 57 శాతం మంది దంపతులు ఒక్క బిడ్డతోనే ఆగిపోతున్నారని, కేవలం 9 శాతం మంది మాత్రమే ఇద్దరి కంటే ఎక్కువ మందిని కంటున్నారని వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే, ప్రస్తుతం 10 శాతంగా ఉన్న వృద్ధుల జనాభా 2047 నాటికి 23 శాతానికి చేరుతుందని, ఫలితంగా మానవ వనరుల కొరత తీవ్రమవుతుందని ఆయన పేర్కొన్నారు.
పురుషులకు పితృత్వ సెలవులు
ఈ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు ప్రతిపాదించింది. పిల్లల పెంపకం కేవలం తల్లుల బాధ్యతే కాదని, తండ్రులు కూడా భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. దీనికోసం పురుషులకు కూడా పిల్లల సంరక్షణ సెలవులు కల్పించనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగం చేసే మహిళల కోసం కార్యాలయాల్లోనే చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఆర్థిక భారంతో పిల్లలను వద్దనుకునే వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.