అనర్హత పిటిషన్ కేసులో కడియంపై విచారణ క్లోజ్
రేపు దానంపై విచారణ
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై విచారణ గురువారంతో ముగిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద వేసిన ఈ పిటిషన్‌పై కొంతకాలంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరుపుతున్నారు. గురువారం జరిగిన తుది విచారణలో అటు కడియం తరపు న్యాయవాదులు, ఇటు వివేకానంద తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
వాటిని రికార్డ్ చేసిన స్పీకర్.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కూడా గురువారమే విచారణ జరగాల్సి ఉంది. ఆయన తరఫు న్యాయవాదులు అదనపు సమయం కోరడంతో విచారణను స్పీకర్ శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేశారు.
దానంపై అనర్హత పిటిషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ఆధారాలతో పిటిషన్ వేశానని, స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని, దానంపై అనర్హత వేటు పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.