వైకాపా ఆర్థిక విధ్వంసంతో ఏపీ 30 ఏళ్లు వెనక్కి: పవన్
అమరావతి: వైకాపా ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. ద్రవ్య వినిమియ బిల్లుపై శాసనసభలో ఆయన మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వం రూ.9 లక్షల కోట్ల మేర అప్పులు మాపై ఉంచి వెళ్లింది. రూ.35 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. మేము రూ.25 వేల కోట్ల బిల్లులు చెల్లించాం. వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల వేల కోట్ల నిధులు నిరుపయోగమయ్యాయి’’ అని అన్నారు.
‘‘జలజీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఈ పథకానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ 5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. న్యాయశాఖకు కూటమి ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా కోర్టు భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి’’ అని పవన్ అన్నారు. వైకాపాలోని కొందరు ఇష్టం వచ్చినట్లు తిట్టి కులం వెనుక దాక్కుంటున్నారని పవన్ ఆరోపించారు.