India News: సంక్షోభం సమయంలో భారత్‌కు 30 రోజుల మినహాయింపు.. రష్యా చమురు కొనుగోలుకు అమెరికా మినహాయింపు
అమెరికా- ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ మీద కొనసాగిస్తున్న యుద్ధం వల్ల చమురు సంక్షోభం ఏర్పడుతోంది. దాంతో 30 రోజులపాటు రష్యా చమురు కొనుగోలుకు డొనాల్డ్ ట్రంప్ మినహాయింపు ఇచ్చారు.
వాషింగ్టన్: సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురు నౌకలను భారతదేశానికి పంపడానికి అమెరికా అనుమతించింది. ఇది కేవలం 30 రోజుల తాత్కాలిక మినహాయింపు మాత్రమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మినహాయింపు ఇచ్చారు. ఈ నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్‌పై ఒత్తిడిని తగ్గిస్తుందని, అలాగే చమురు సంక్షోభంలో భారత్‌కు భారీ ఉపశమనం కలిగిస్తుందని ఇద్దరు సీనియర్ అమెరికా అధికారులు రాయిటర్స్‌కు తెలిపారు.
భారత్ వద్ద 25 నుంచి 40 రోజుల ముడి చమురు నిల్వలు
భారత్‌కు మధ్యప్రాచ్యం నుండి చాలా చమురు వస్తుంది. దేశంలో కేవలం 25 నుంచి 40 రోజుల వరకు ముడి చమురు నిల్వలు ఉన్నాయి. 40 శాతం చమురు హోర్ముజ్ జలసంధి ద్వారా వస్తుంది. ఇక్కడ ఏదైనా సమస్య తలెత్తితే భారత్, చైనా, దక్షిణ కొరియా దేశాలకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే అమెరికా భారత్‌కు ఉపశమనం ఇచ్చింది. 'సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురును భారతదేశానికి అమ్మకాలు కొనసాగించడానికి 30 రోజుల తాత్కాలిక మినహాయింపును జారీ చేశాం' అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు.
2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ రష్యా చమురుకు అతిపెద్ద కొనుగోలుదారుగా మారింది. అయితే ఈ ఏడాది జనవరి నుండి, చమురు శుద్ధి కర్మాగారాలు తక్కువ కొనుగోలు చేస్తున్నాయి. రష్యాకు చమురు ద్వారా నిధులు అందకూడదని అమెరికా పలు దేశాలపై ఒత్తిడి తెచ్చింది. రష్యా చమురు కొనుగోలు తగ్గింపు అంశంలో భారత్ 25 శాతం టారిఫ్ ప్రమాదాన్ని తప్పించుకుంది. అమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కూడా భారత ప్రభుత్వం కుదుర్చుకుంది.