మెగా ఇంటి కోడలికి ఆన్‌లైన్ వేధింపులు
నారాయణగూడ, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమ వేదికగా తమ పరువుకు భంగం కలిగించే రీతిలో ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నటి లావణ్య త్రిపాఠి కొణిదెల హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐటీచట్టం సెక్షన్ 67తో పాటు భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)78, 79 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు వివరాల్లోకి వెళితే.. ‘పర్పుల్ క్రెయాన్00’ ఇన్‌స్టాఖాతా ద్వారా తనపై, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని పలు పోస్టులు, కామెంట్లలో దూషణలు, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వేధింపులు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయని, ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీయాలని ఆరోపణలు చేస్తూ అవమానిస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని పోస్టులపై కామెంట్ల రూపంలో అసభ్య పదజాలంతో దూషణలు చేయడమే కాకుండా తన వ్యక్తిత్వం, నైతిక విలువలను ప్రశ్నించేలా ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఇన్‌స్టా ఖాతా నడుపుతున్న ఆ వ్యక్తిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఆ ఖాతా ద్వారా చేసిన పోస్టులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.