అందుకే ఇరాన్ నౌకలను ముంచేస్తున్నాం: ట్రంప్
ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్‌తో యుద్ధం ప్రారంభం అనంతరం ఇప్పటివరకు 5వేల లక్ష్యాలను ఛేదించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తమ దాడులతో ఇరాన్ (Iran) క్షిపణి సామర్థ్యం 10 శాతానికి పడిపోయిందన్నారు. మూడున్నర రోజుల్లో ఆ దేశానికి చెందిన 46 అగ్రశ్రేణి నౌకలను యూఎస్ మిలిటరీ ముంచేసిందంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా సైనిక అధికారులతో జరిగిన సంభాషణను ప్రస్తావించారు.
‘‘ఇరాన్ డ్రోన్, క్షిపణి సామర్థ్యం పూర్తిగా ధ్వంసమవుతోంది. 46 నౌకలను ముంచేశామంటే నమ్మగలరా..? ఈ విషయంలో మన సైన్యంతీరు నాకు అంతగా నచ్చలేదు. దాంతో వెంటనే సైనికాధికారులతో మాట్లాడాను. ఆ నౌకలు ఎలాంటివని అడిగాను. అవి అగ్రశ్రేణి నౌకలని చెప్పారు. ‘మరి అలాంటప్పుడు స్వాధీనం చేసుకొని మనం వాడుకోవచ్చు కదా..! ఎందుకు ముంచేశారు..?’ అని ప్రశ్నించాను. వాటిని ముంచడం సరదాగా ఉందని, అలా చేయడమే సురక్షితమని సమాధానం ఇచ్చారు. నాక్కూడా అది నిజమేనని అనిపించింది. ఇక మన సైన్యం ఇప్పుడు పశ్చిమాసియాకు విహారయాత్రకు వెళ్లింది. కొంత చెడును వదిలిస్తోంది. ఆ యాత్ర కొద్దికాలమే ఉంటుంది. అది మీరు కూడా చూస్తారు. శత్రువును పూర్తిగా ఓడించేవరకు మన మిలిటరీ వెనకడుగు వేయదు’’ అనిపేర్కొన్నారు.