వెలుగుమట్లలో ఇండ్ల నిర్మాణం ప్రారంభం..ఉగాదిలోపు విద్యుత్ సరఫరా పనులు పూర్తి
38 ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్రంలోనే మోడల్ కాలనీగా వెలుగుమట్లను తీర్చిదిద్దుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 38 ఇండ్ల నిర్మాణ పనులకు గురువారం ఖమ్మం సీపీ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పేదలకు భూములు అమ్మేశారన్నారు. వెలుగుమట్లలో గత ఎనిమిదేండ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, తాగునీరు, విద్యుత్ వంటి వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారన్నారు. దిన దిన గండాల నుంచి పేదలను కాపాడాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని చెప్పారు.
భూదాన్ భూములు ఆక్రమించుకోవాలని సీసీఎల్‌ఏ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే కూల్చివేతలు జరిగాయన్నారు. డిసెంబర్ 9 నాటికి కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. నిరుపేదలకు సున్నా వడ్డీతో లోన్లు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, హౌజింగ్ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.