Dukes Ball Shortage: క్రికెట్‌పై ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం సెగ.. ఇంగ్లాండ్లో బంతుల కొరత
Dukes Ball Shortage: మధ్య ప్రాచ్యంలో ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య నడుస్తున్న యుద్ధం అంతర్జాతీయ క్రికెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ యుద్ధం వలన ముఖ్యంగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరిగే కౌంటీ క్రికెట్ సీజన్‌కి సెగ తగిలింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ సీజన్‌కు ముందు ఈ సమస్య తలెత్తింది. ఈ టోర్నీలో ఉపయోగించే ప్రముఖ డ్యూక్స్ బంతుల సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది. సాధారణంగా ప్రతి క్లబ్‌కు సరిపడా నిల్వలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 50 శాతం మాత్రమే ఇంగ్లాండ్ బోర్డు దగ్గర అందుబాటులో ఉన్నాయి.
ఈ డ్యూక్స్ బంతులు ప్రధానంగా భారత్, పాకిస్తాన్ లాంటి దక్షిణాసియా దేశాల్లో తయారవుతాయి. అయితే మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభంతో ఈ బంతులను ఇంగ్లాండ్‌కు రవాణా చేయడంలో పెద్ద ఎత్తున జాప్యం కొనసాగుతుంది. ఫ్యాక్టరీల్లో బంతులు సిద్ధంగా ఉన్నప్పటికీ, వాటిని ఎక్స్ పోర్టు చేయడానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిపై బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ సంస్థ యజమాని దిలీప్ జజోడియా మాట్లాడుతూ.. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల మేము పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం.. ఈ సీజన్ ప్రారంభానికి క్లబ్‌లకు కేవలం 50 శాతం బంతులనే ఇవ్వగలుగుతున్నాం.. మిగిలినవి తర్వాత అందించాల్సి వస్తోందని వెల్లడించారు.
అంతేకాదు, విమానయాన సంస్థలు సరుకు రవాణా చేసేందుకు ముందుకు రావడం లేదని, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ సంస్థ యజమాని దిలీప్ జజోడియా పేర్కొన్నారు. సాధారణంగా ఒక బాక్స్‌కు కిలోకు 5 డాలర్లు వసూలు చేసేవారు. కానీ ప్రస్తుతం అదే ధర 15 డాలర్లకు పెరిగిపోయింది అన్నారు. ఈ సంక్షోభం మరింత తీవ్రంగా మారితే, ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాకు చెందిన కూకబుర్రా బంతులను ఉపయోగించాల్సిన పరిస్థితి రావొచ్చని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.