కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్..
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. తన మెట్టినిల్లు నిజామాబాద్ నుంచి పార్టీ సింబల్, విధివిధానాలు వెల్లడించే అవకాశం ఉందని జాగృతి వర్గాలు చెబుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. శుక్రవారం ( మార్చి 27 ) ఉదయం 8 గంటలకు నిజామాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్)లో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ ప్రకటనతో పాటు తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రజా జాగృతి పేరున పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘానికి ఇప్పటికే అప్లై చేసుకున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ పై ఎన్నికల సంఘం ఆలస్యం చేస్తున్నదని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యేలా ఆదేశించాల్సిందిగా పిటిషన్ లో కోరారు. పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి’(టీపీజే) అని ఢిల్లీ హైకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ద్వారా స్పష్టమవుతున్నది.