ఏపీలో ఇంటర్ సెకండియర్ సిలబస్ లీక్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు
ఏపీ ఇంటర్ సెకండియర్ సిలబస్ లీక్ వ్యవహారంలో కేసు నమోదు నమోదైంది. తెలుగు సంస్కృత అకాడమీ డిప్యూటీ డైరక్టర్ కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అమరావతి, మార్చి 26: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో కలకలం రేగుతోంది. ఇంటర్మీడియట్ సెకండియర్ కొత్త సిలబస్ అధికారికంగా విడుదలకాక ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ విద్యా సంవత్సరం (2026) నుంచి ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థుల కోసం ప్రభుత్వం కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టింది. తెలుగు అకాడమీ, ఇంటర్ బోర్డు సంయుక్తంగా ఈ సిలబస్‌ను రూపొందించాయి. అయితే, ఈ పుస్తకాలు ముద్రణ దశలో ఉండగానే, సిలబస్‌కు సంబంధించిన PDF క్లిప్పింగ్స్ వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తెలుగు, సంస్కృత అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఫిజిక్స్ (Physics), కెమిస్ట్రీ (Chemistry) సబ్జెక్టుల సిలబస్ పీడీఎఫ్‌లు బయటకు రావడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ లీక్ వ్యవహారంలో VGS పబ్లిషర్స్ హస్తం ఉన్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్న తెలుగు అకాడమీ, సదరు సంస్థకు నోటీసులు జారీ చేసింది. అధికారికంగా సిలబస్ విడుదల కాకముందే ప్రైవేట్ పబ్లిషర్ల వద్దకు ఈ సమాచారం ఎలా చేరిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డిజిటల్ ఆధారాలను సేకరించిన సైబర్ క్రైమ్ బృందం, ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో పడింది.