నన్నే ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు తీసుకోమన్నరు.. ఇంట్రెస్ట్ లేదని చెప్పిన: ట్రంప్
వాషింగ్టన్: షాకింగ్ నిర్ణయాలు, చిత్రవిచిత్ర వాదనలు చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కొత్త రాగం అందుకున్నారు. ఈ సారి మొత్తం ప్రపంచమే షాకయ్యే అసాధారణ వ్యాఖ్యలు చేశారు. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్‌గా తనను బాధ్యతలు తీసుకోవాలని ఇరాన్ కోరిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు ట్రంప్. కానీ ఇరాన్ ప్రపోజల్ తాను తిరస్కరించానని చెప్పుకొచ్చాడు ట్రంప్.
అమెరికాతో ఎలాంటి శాంతి చర్చలు జరపడం లేదన్న ఇరాన్ వ్యాఖ్యలను కూడా ట్రంప్ తోసిపుచ్చారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని.. ఆ దేశ ప్రభుత్వం కూడా కాల్పుల విరమణకు ఆసక్తిగా ఉన్నప్పటికీ స్వదేశంలో ఎదురయ్యే పరిణామాలకు భయపడి వెనకడుగు వేస్తోందన్నారు. ఇరాన్‌పై జరిగిన ఆపరేషన్‌ను సైనిక విధ్వంసంగా అభివర్ణించి ట్రంప్.. యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని పునరుద్ఘాటించారు.
నెల రోజులుగా సాగుతోన్న యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్ కు అమెరికా 15 షరతులతో కూడిన శాంతి ప్రణాళిక ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే, అమెరికా ప్రపోజల్‌ను ఇరాన్ తిరస్కరించింది. కౌంటర్ గా ఇరాన్ కూడా రిటర్న్ కండిషన్స్ పెట్టింది. అమెరికా తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని తేల్చిచెప్పింది. అంతేకాకుండా ఇప్పటి వరకు అమెరికాతో ఎలాంటి శాంతి చర్చలు జరపలేదని స్పష్టం చేసింది.
ఇరాన్ వాదన ఇలా ఉంటే.. అమెరికా వాదన మరోలా ఉంది. శాంతి చర్చల కోసం ఇరాన్ తమతో చర్చలు జరుపుతోందని అమెరికా వాదిస్తోంది. ఇరాన్ మాత్రం మేం ఎలాంటి చర్చల్లో పాల్గొనలేదని చెబుతోంది. అంతేకాదు ప్రస్తుత దశలో అమెరికాతో శాంతి చర్చలు జరిపే ఇంట్రెస్ట్.. మా డిమాండ్లకు అంగీకరించే వరకు యుద్ధం ముగించే ఆలోచన తమకు లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది.