Telangana SSC Exams: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
జాతీయ విద్యా విధానానికి (NEP) అనుగుణంగా తెలంగాణలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
హైదరాబాద్: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో వచ్చే ఏడాది నుంచి వీటిని రద్దు చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తెలంగాణలో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) పరీక్షలను రద్దు చేస్తున్నారనే వదంతులపై తెలంగాణ విద్యా కమిషన్ (TEC) క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ పరిశీలనలో అటువంటి ప్రతిపాదనేదీ లేదని TEC సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు పేర్కొన్నారు.
తెలంగాణ విద్యా విధానం 2026 (Education Policy for Telangana 2026) విధాన పత్రాన్ని విడుదల చేసిన తర్వాత తెలంగాణలో SSC పరీక్షల రద్దుపై పుకార్లు మొదలయ్యాయి. ఆ డాక్యుమెంట్‌లో ఎస్‌ఎస్‌సి బోర్డును ఇంటర్మీడియట్ బోర్డు (BIE)తో విలీనం చేయడం వంటి సంస్కరణలను సూచించారు. పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని ఎక్కడా సూచించలేదు. అయితే, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ 11, 12 తరగతులను స్కూల్లో మొదలుపెట్టాయి. దాంతో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు అని వదంతులు త్వరగా వ్యాపించాయి.