అమరావతి చట్టబద్ధతపై తీర్మానం.. సభలో ప్రవేశపెట్టిన సీఎం
అమరావతి: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు రాష్ట్ర శాసనసభ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే.. తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ఆమోదించాక కేంద్రానికి పంపనున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ఏపీకి శాశ్వత రాజధాని నిర్మాణం అవసరమని సీఎం చంద్రబాబు సంకల్పించారని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదన్నారు.
‘‘గత పాలకులు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. విడిపోయాక రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. 2015 జనవరి 1న ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చాం. ఫిబ్రవరి నాటికి 34,400 ఎకరాలను 29 వేల మంది రైతులు ఇచ్చారు. వైకాపా నాయకులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా రైతులు ఎక్కడా తలొగ్గలేదు’’ అని మంత్రి నారాయణ అన్నారు.