త్వరలో తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం: బాలకృష్ణ
హైదరాబాద్: క్యాన్సర్ చికిత్స అందరికీ అందుబాటులో ఉంచాలనేదే తమ లక్ష్యమని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. ఆస్పత్రిలో అడ్వాన్స్డ్ అల్ట్రాసౌండ్ సహా పలు పరికరాలు, అంబులెన్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.
‘‘బీడీఎల్ సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని ఆస్పత్రికి విరాళంగా ఇచ్చారు. ఏఐ సాంకేతికత కలిగిన యంత్రం ఇది. తక్కువ సమయంలోనే స్కానింగ్ చేసి కచ్చితత్వంతో కూడిన ఫలితాలను అందిస్తుంది. దాతల సహకారంతో ఆస్పత్రిలో పేదలకు మెరుగైన సేవలు అందించగలుతున్నాం. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు, దాతల సహకారంతో ఆస్పత్రి ఈ స్థాయికి చేరింది. త్వరలో దీన్ని విస్తరిస్తాం. ఏపీ రాజధాని పరిధి తుళ్లూరులో మరో వారం రోజుల్లో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభిస్తాం’’ అని బాలకృష్ణ తెలిపారు.