Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Israel-Iran Conflict | ఇజ్రాయెల్‌లో నెలకొన్న ఉద్రిక్తతల వెనుక రాజకీయ, భౌగోళిక కారణాలతో పాటు మతపరమైన అంశాలున్నాయి. మూడో టెంపుల్ నిర్మాణం, మెస్సియా (Messiah) రాకపై యూదుల నమ్మకం చర్చనీయాంశంగా మారింది.
మత పరమైన విషయాల్లో అత్యంత కఠినం గా ఉండే జాతిగా యూదులకు పేరు. వారి మతపరమైన సెంటిమెంట్ లలో అత్యంత ముఖ్యమైనది జెరూసలేం లో మూడో టెంపుల్ నిర్మాణం. దీనికోసం వాళ్లు 2000 ఏళ్ళు గా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ మూడో టెంపుల్ నిర్మాణం ఫై ఇరాన్ యుద్ధం లో ఒక సెంటిమెంట్ గా మారుతోంది.
ఈజిప్ట్ లో 400 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్న తర్వాత ఇజ్రాయేల్ కు తిరిగి వచ్చారు యూదులు. వాళ్ళ మూడో రాజు సొలొమోను దేవుడి ఆదేశం మేరకు 957BCE లో ఒక దేవాలయాన్ని నిర్మించారు. యూదులకు సంబంధించి అది అత్యంత పవిత్రమైన స్థలం. 500 ఏళ్లపాటు వాళ్లు అక్కడే పూజలు జరిపారు. సొలోమోన్ తర్వాత ఇజ్రాయిల్ రెండు రాజ్యాలుగా విడిపోయినా జెరూసలేం లోని ఈ ఆలయంలో ఇశ్రాయేల్, యూదా అనే ఈ రెండు రాజ్యాల ప్రజలు పూజలు జరుగుతూ ఉండేవారు. యూదులు కాని వారు ఎవరైనా ఆలయం లోకి ప్రవేశిస్తే వారికి మరణ శిక్ష విధించేవారు. 720BCE లో అస్సిరియా సామ్రాజ్యం (నేటి సిరియా కేంద్రం గా ఏర్పడ్డ పెద్ద సామ్రాజ్యం ) దండెత్తి ఇశ్రాయెల్ రాజ్యాన్ని నాశనం చేసింది.
539BCE లో బాబిలోన్ ని జయించి పర్షియన్ సామ్రాజ్యం ఆవిర్భవించింది. అదే నేటి ఇరాన్. దాని చక్రవర్తి సైరస్ ది గ్రేట్. ఇతను సెక్యులర్ పాలకుడు. అంతకుముందు బాబీలోన్ జయించిన రాజ్యాల ప్రజలను విడుదల చేసి వారి వారి రాజ్యాలకు వెళ్లిపోనిచ్చాడు. బాబిలోన్ లో 70 ఏళ్ల బానిసత్వం తర్వాత యూదుల్లో చాలామంది జెరూసలేం కు తిరిగివచ్చారు. వారికి వారి టెంపుల్ మళ్ళీ కట్టుకోవడానికి సైరస్ చక్రవర్తి అనుమతి ఇవ్వడంతో పాటు ఆ ఆలయం లోని పూజా సామాగ్రి ని సైతం తిరిగి ఇచ్చేయడం తో 516BCE లో జెరూసలేం లో రెండో టెంపుల్ కట్టారు. ఈ ఆలయం కూడా 500ఏళ్ల పాటు యూదులకు పవిత్రా స్థలం గా మారింది. 332BCE లో అలెగ్జాండర్ పర్షియాను జయించిన తరువాత ఇరాన్ తో పాటు జెరూసలేం కూడా గ్రీక్ పాలకుల చేతిలోకి వెళ్ళింది. అయితే అలెగ్జాండర్ గాని ఆ తర్వాత గ్రీకులు గానీ జెరూసలేం లోని టెంపుల్ జోలికి వెళ్లలేదు. పైగా ఆలయ సంప్రదాయాన్ని గౌరవించారు అని యూదు గ్రంథాలు చెబుతున్నాయి.