ఏప్రిల్ 02 నుంచి గ్రామ సభలు : డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్నీ గ్రామ పంచాయతీల్లో గురువారం నుంచి గ్రామ సభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జూన్ 2 నుంచి అమలు చేయబోతున్న కొత్త ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్స్లో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒకే రకంగా గ్రామ సభల నిర్వహణ జరగాలని ఆదేశించారు.
సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లు చదవాలి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లను ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో చదివి వినిపించాలని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి పంపిన సందేశం వినిపించి గ్రామ సభ స్టార్ట్ చేయాలని చెప్పారు. ‘జూన్ 2 నుంచి ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున అందించే జీవిత బీమా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారంలో భాగంగా మూడు రోజులపాటు గ్లాస్ పాలు, మూడు రోజులపాటు రాగి జావా అందించడం, ఇంటర్ విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసేలా వివరించాలి’ అని భట్టి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవా రంగాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే గ్రామసభల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై చర్చ జరగాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాల ఉద్దేశాలను వివరిస్తూ ముఖ్యమైన తీర్మానాలు చేయాలన్నారు.