రూల్స్కు విరుద్ధంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి : మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీ కృష్ణ, రాజేశ్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో కనిష్ట నీటిమట్టం 834 అడుగులు ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయరాదనే నిబంధన ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం దాన్ని బేఖాతరు చేసిందని మంత్రి ఆరోపించారు.
తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తోడేస్తున్నదని మండిపడ్డారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ సర్కార్ తన మొండిపట్టు వీడలేదని విమర్శించారు. ఏపీ మొండివైఖరికి నిరసనగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులమంతా కలిసి శ్రీశైలం వద్ద “వంటా వార్పు” కార్యక్రమానికి పిలుపునిచ్చామని, ఈ ఆందోళనతో దిగివచ్చిన ఏపీ సర్కార్ ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందని మంత్రి వెల్లడించారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయంలో ఎవరితోనూ రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు. పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగితే సహించేది లేదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని, ప్రజల పక్షాన పోరాడటానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి జూపల్లి హెచ్చరించారు.