రాజధాని విషయంలో తేల్చుకోలేకపోతున్న వైఎస్ఆర్‌సీపీ - ఓ విధానం లేకుండా ప్రజలకేం చెబుతారు?
Capital issue: రాజధాని విషయంలో వైఎస్ఆర్‌సీపీకి ఓ పాలసీ లేకుండా పోయింది. అమరావతికి మద్దతు లేదా..తమది మూడు రాజధానుల పాలసీ అనో ఏదో ఒకటి చెప్పాల్సింది .. చెప్పడం లేదు.
YSRCP lacks policy on capital issue:
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ గందరగోళానికి గురవుతోంది. పార్లమెంట్ లో చట్టం చేయబోతున్న దశలో ఆ పార్టీ అనుకూలమో.. వ్యతిరేకమో ఓ ప్రకటన చేయలేకపోతోంది. ఆ పార్టీ రాయలసీమ నేతలు, ఉత్తరాంద్ర నేతలు మాత్రం అమరావతి రాజధాని అంటే తమ ప్రాంతానికి అన్యాయం చేయడమేనని ప్రకటనలు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ అమరావతికి వ్యతిరేకం కాదంటారు కానీ.. అనుకూలం అని మాత్రంమ చెప్పరు. ఇది వైసీపీ అధికారిక పాలసీనో కాదో తెలియదు కానీ ఈ అంశంపై ఇలా భిన్నమైన మాటలు మాట్లాడటం మాత్రం ఆ పార్టీ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది
అమరావతికి వ్యతిరేకం కాదు..కానీ అనుకూలం కూడా కాదు!
పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల జగన్ మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదని, కేవలం అక్కడ జరిగిన అవినీతిని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే, ఇదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వైసీపీ నేతలు మాత్రం భిన్నమైన గళం వినిపిస్తున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేయడం తమ ప్రాంతాలకు అన్యాయం చేయడమేనని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా సాగుతున్న ఈ భిన్న స్వరాలు పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతున్నాయా? లేక పార్టీలో నియంత్రణ లోపించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీది అధికారంగా మూడు రాజధానుల పాలసీ - కానీ ఇప్పుడు సైలెంట్ !
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ మూడు రాజధానుల మంత్రాన్ని జపించి, అభివృద్ధిని గాలికి వదిలేసిందన్న విమర్శలు మూటగట్టుకుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, గతంలో తాము చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. సజ్జల వంటి నేతలు అమరావతికి వ్యతిరేకం కాదంటూనే, మరోవైపు కేంద్రాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించేలా మాట్లాడకపోవడం ఒక రకమైన అటూ ఇటూ కాని పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ఈ గందరగోళం ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని తగ్గించడమే కాకుండా, పార్టీ విధానపరమైన అస్పష్టతను వేలెత్తి చూపుతోంది.