‘ధురంధర్ 2’ ఎంతమంది చూశారంటే..!
ఇంటర్నెట్ డెస్క్: రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. వసూళ్లలోనే కాకుండా, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య (ఫుట్‌ఫాల్స్) విషయంలో కూడా ఈ సినిమా బాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఇండియాలో 3 కోట్ల ఫుట్‌ఫాల్స్‌ను దాటేసింది. కరోనా తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో హిందీ చిత్రంగా ‘ధురంధర్ 2’ నిలిచింది. గతంలో ‘గదర్ 2’, ‘జవాన్’, స్త్రీ 2, ఛావా, ‘ధురంధర్’ మొదటి భాగం మాత్రమే ఈ మార్కును చేరుకున్నాయి. ప్రస్తుతం హిందీ వెర్షన్లలో అత్యధిక ఫుట్‌ఫాల్స్ సాధించిన చిత్రంగా ‘పుష్ప 2’ (దాదాపు 4 కోట్లు) కొనసాగుతోంది. అయితే, ‘ధురంధర్: ది రివెంజ్’ హవా చూస్తుంటే.. ఫుల్ రన్ ముగిసే సమయానికి అన్ని భాషల్లో కలిపి 5 కోట్ల ఫుట్‌ఫాల్స్‌ను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ రెండు భాగాలు కలిపి మొత్తం 8 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడవడం అనేది భారతీయ సినిమా చరిత్రలో ఒక అసాధారణమైన విజయంగా రికార్డు సృష్టించనుంది.
రూ.1400 కోట్ల ‘ధురంధర్ 2’..
కలెక్షన్ల పరంగా ‘ధురంధర్ 2’ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 13వ రోజు కూడా ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్ల మార్కును దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా చరిత్ర సృష్టించింది (Dhurandhar 2 Collections). భారతదేశంలో ఈ సినిమా ఇప్పటివరకు రూ.899 కోట్ల నెట్ వసూళ్లను సాధించగా, బుధవారం మార్నింగ్ షోలతో రూ.900 కోట్ల మైలురాయిని చేరుకుంది. రెండో వీకెండ్‌లో రూ.170 కోట్లు వసూలుచేయడంతో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక రెండో వారాంతపు వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.