చరిత్రలో ప్రజా రాజధానిగా అమరావతి గుర్తుంటుంది: రామ్మోహన్‌నాయుడు
దిల్లీ: తెలుగు ప్రజలందరికీ ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. చరిత్రలో ప్రజా రాజధానిగా అమరావతి గుర్తుంటుందని చెప్పారు. రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. అనంతరం చర్చకు ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అనుమతించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు.
‘‘అమరావతికి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలుగు ప్రజలంతా గర్వంగా భావిస్తున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవడం మా నాయకుడు నేర్పించారు. ఏపీ రాజధాని గురించి ప్రజలకు స్పష్టత ఇస్తున్నాం. విభజన సమయంలో ఒక రాష్ట్రానికి రాజధాని ఉంది.. మరో రాష్ట్రానికి అలా లేకుండా వదిలేయడంతో సమస్య మొదలైంది. విభజనకు వ్యతిరేకం కాదు కానీ.. జరిగిన విధానం సరిగా లేదు. రాష్ట్ర విభజన దేశంలో తొలిసారి జరగలేదు. వాజ్‌పేయీ హయాంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విభజన జరిగింది.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంది. 5 కోట్ల మంది ఏపీ ప్రజలు సీఎం చంద్రబాబు వైపు ఆశగా ఎదురుచూశారు. తెలుగు ప్రజలకు ఆయన ఎన్నో ఆకాంక్షలు, విజన్ కల్పించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని ముందుకెళ్లారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములిచ్చారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల నాటకమాడింది. రాజధాని అమరావతి కోసం ఉద్యమించిన రైతులను తీవ్రంగా హింసించారు. గర్భిణులు అని కూడా చూడకుండా లాఠీలతో కొట్టించారు. అమరావతి మహిళలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. 2014లోనే అసెంబ్లీలో అమరావతిపై ఏకగ్రీవ తీర్మానం జరిగింది. చరిత్రలో ఏ రాజధాని చూసినా నదీ తీర ప్రాంతాల్లోనే విలసిల్లాయి. కృష్ణా నది తీరంలో అమరావతి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐకానిక్, వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది’’ అని రామ్మోహన్‌నాయుడు అన్నారు.