కాశ్ పటేల్ సహా కీలక అధికారులకు ట్రంప్ ఉద్వాసన..?
ఇంటర్నెట్‌డెస్క్: తన పాలనా యంత్రాంగంలో కీలక హోదాల్లో ఉన్న పలువురిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేటు వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్, అటార్నీ జనరల్ పామ్ బోండీని తొలగించిన నేపథ్యంలో ఈ వేటు వార్తలకు బలం చేకూరింది. ఇప్పుడిక ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ (Kash Patel), డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబ్బార్డ్(Tulsi Gabbard)ను తొలగించొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ జాబితాలో ఆర్మీ సెక్రటరీ డేనియల్ డ్రిస్కోల్, లేబర్ సెక్రటరీ లోరి చావెజ్ తదితరులు ఉన్నారని సమాచారం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..
పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కాశ్ పటేల్‌ను తొలగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన దగ్గరినుంచి వ్యక్తిగత విషయాల వల్ల ఆయన పలుమార్లు వివాదంలో చిక్కుకొన్నారు. ఇరాన్‌తో యుద్ధం విషయంలో వచ్చిన విమర్శలను ఖండించడంలో గబ్బార్డ్ విఫలమయ్యారని ట్రంప్ భావిస్తున్నారు.
ప్రభుత్వ వాదనలకు, సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ విచారణలో గబ్బార్డ్ చెప్పిన విషయాలకు పొంతన లేకపోవడంతో అధ్యక్షుడు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్‌లో ఇరాన్‌లోని అణుశుద్ధి కేంద్రాలపై దాడులు చేసిన తర్వాత.. ఆ దేశం తిరిగి అణుశుద్ధి సామర్థ్యాన్ని పునరుద్ధరించుకొనే ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవని ఇటీవల గబ్బార్డ్ వెల్లడించారు. ఇరాన్ అణుసామర్థ్యాలను దెబ్బతీసే లక్ష్యంతోనే తాము యుద్ధానికి దిగినట్లు ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే.