భారతీయ ట్రక్ డ్రైవర్లకు అమెరికాలో షాక్.. కొత్త రూల్స్ రాకతో లైసెన్సులు రద్దు
అమెరికాలో స్థిరపడి, స్టీరింగ్ పట్టి డాలర్లు సంపాదిస్తున్న భారతీయ ట్రక్ డ్రైవర్లకు అందులోనూ ముఖ్యంగా సిక్కులకు ఊహించని షాక్ తగిలింది. ఇండియానా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కఠిన నిర్ణయం వేల కుటుంబాల జీవనోపాధిని ప్రశ్నార్థకం చేసింది అమెరికాలో. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం.. దాదాపు 18వందల మంది నాన్-డొమిసిల్డ్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లను అక్కడి బ్యూరో ఆఫ్ మోటార్ వెహికల్స్ రద్దు చేసింది. దీంతో రోడ్ల మీద రయ్‌మని దూసుకుపోయే భారీ ట్రక్కులు ఒక్కసారిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
కొత్త చట్టం.. పాత డ్రైవర్లకు కష్టం
అమెరికాలోని ఇండియానా హౌస్ ఎన్‌రోల్డ్ యాక్ట్ 1200 ప్రకారం.. ఇకపై H-2A, H-2B, E-2 రకాల వీసా హోల్డర్లకు మాత్రమే కమర్షియల్ లైసెన్స్‌లు జారీ చేస్తారు. గతంలో వర్క్ ఆథరైజేషన్ ఉన్న విదేశీయులందరికీ ఈ అవకాశం ఉండేది. ఇప్పుడు మెజారిటీ డ్రైవర్లు ఈ కొత్త రూల్స్ కిందికి రాకపోవడంతో వారి లైసెన్స్‌లు చెల్లకుండా పోయాయి. మార్చి 16నే నోటీసులు పంపిన యూఎస్ ప్రభుత్వం.. ఏప్రిల్ 1 కల్లా వారిని సాధారణ డ్రైవింగ్ లైసెన్స్‌లకు డౌన్‌గ్రేడ్ చేసేసింది. అంటే వారు ఇకపై కారు నడుపుకోవచ్చు. అయితే ఇన్నాళ్లుగా ఉపాధిని ఇచ్చిన ట్రక్కును మాత్రం ముట్టుకోవడానికి వీల్లేకుండా పోయింది.
సేఫ్టీ సాకుతో వేటు..
ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం భద్రతా కారణాలను సాకుగా చూపుతోంది. ఇటీవలి కాలంలో నాన్-డొమిసిల్డ్ డ్రైవర్ల వల్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టారు. డ్రైవర్లకు సరైన శిక్షణ ఉందా? వారికి ఇంగ్లీష్ భాషపై పట్టు ఉందా? డ్రైవింగ్ రికార్డులు పక్కాగా ఉన్నాయా? అనే అంశాలను తనిఖీ చేయడమే ఈ చట్టం ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఫెడరల్ మోటార్ క్యారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగానే రూల్స్ లో మార్పులు చేసినట్లు స్పష్టం చేశారు.
స్తంభించనున్న సప్లై చైన్..
అమెరికాలో ఇప్పటికే ట్రక్ డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో అనుభవజ్ఞులైన భారతీయ డ్రైవర్లపై నిషేధం విధించడం వల్ల సప్లై చైన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో ఇలాంటి రూల్స్ అమలు కాగా.. ఇప్పుడు ఇండియానా రాష్ట్రం కూడా అదే బాటలో నడవడం వలస డ్రైవర్లను ఆందోళనకు గురి చేస్తోంది. వేల మైళ్ల దూరం సరుకులను చేరవేస్తూ అమెరికా ఆర్థిక చక్రం తిరగడంలో కీలక పాత్ర పోషిస్తున్న మన డ్రైవర్లకు.. కొత్త చట్టం ఒక స్పీడ్ బ్రేకర్ లా మారింది. ఇది కేవలం ఒక రాష్ట్రం సమస్యేనా లేక అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తుందా అన్నది ఇప్పుడు డ్రైవర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.