ఇరాన్ ప్రతిపాదనలు.. చాట్‌జీపీటీ రాసింది: జేడీ వాన్స్
ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్‌తో కాల్పుల విరమణ (USA-Iran ceasefire) కుదిరిన నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మూడు వర్షన్లలో తన 10 పాయింట్ల ప్రతిపాదనలు పంపిందన్నారు. అందులో ఒకటి చాట్‌జీపీటీ రాసినట్లుగా ఉందని మీడియాతో అన్నారు.
ఇరాన్ నుంచి వచ్చిన మూడు వేర్వేరు ప్రతిపాదనలు గందరగోళాన్ని సృష్టించాయని వాన్స్ పేర్కొన్నారు. తొలుత 10 పాయింట్లతో ఒక ప్రతిపాదనను పంపించినట్లు వెల్లడించారు. అయితే, అది చాట్‌జీపీటీ రాసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌లకు ఆ ప్రతిపాదనలు అందాయన్నారు. వెంటనే వారు వాటిని తిరస్కరించినట్లు వెల్లడించారు.
ఇరాన్ ప్రతిపాదనలకు సంబంధించిన రెండో వర్షన్ కూడా ఉందన్నారు. కాల్పుల విరమణ ప్రకటనలో అధ్యక్షుడు ట్రంప్ దాన్నే ప్రస్తావించారన్నారు. ప్రతిపాదనలకు సంబంధించిన మూడో వర్షన్ మొదటి దానికంటే అత్యంత దారుణంగా ఉందని, అంగీకరించలేనివిధంగా అందులో డిమాండ్లు ఉన్నాయన్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ మూడో ప్రతిపాదన గురించి తమకు తెలిసిందన్నారు. లెబనాన్ కారణంగా.. కాల్పుల విరమణ విఫలం కాకుండా చూడాలని వాన్స్ ఇరాన్‌ను కోరారు. ఈ సీజ్‌ఫైర్ నిబంధనల్లో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల గురించి చేర్చలేదన్నారు.
వాన్స్ నేతృత్వంలో పాక్‌లో చర్చలు..
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య తొలి దశ చర్చలు ఈ శనివారం ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో అమెరికా బృందం ఈ చర్చల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.