‘డెకాయిట్’.. ఆ విషయంలో భయపడ్డా: సుప్రియ యార్లగడ్డ
ఇంటర్నెట్ డెస్క్: అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డెకాయిట్’ (Dacoit). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ నిర్మాత సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ..
ఈ సినిమాను రెండు భాషల్లో (హిందీ, తెలుగు) తీశారు. ఒక లాంగ్వేజ్‌లోనే తీసి డబ్బింగ్ చేసి ఉంటే ఖర్చు తగ్గేది కదా?
సుప్రియ: ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. ప్రతిదీ బడ్జెట్‌తో ముడిపెట్టలేం. మేం చాలా జాగ్రత్తగా తెరకెక్కించాం. వృథా ఖర్చులు పెట్టలేదు. బాలీవుడ్‌లో కూడా మంచి స్పందన వస్తోంది. మలయాళం, కన్నడ, తమిళంలో కూడా డబ్ చేశాం. ఓటీటీల్లో 5 భాషల్లో రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా తీయడానికి ఎన్నిరోజులు పట్టింది?
సుప్రియ: నిర్మాత నాగవంశీ కూడా ఇదే అడిగారు. నేను ఒక సినిమా తీసే సమయంలో వంశీ 10 తీస్తారు.
నేను అన్ని నిర్మించలేను. ఒక్కో నిర్మాతది ఒక్కో శైలి. నేను ఏం చేయగలనో దాన్నే చేస్తా.. పక్కవాళ్లు అన్ని తీస్తున్నారని నేను చేయలేను. ఎన్నిరోజుల సమయం పట్టినా.. మంచి సినిమాను నిర్మించా.
నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కించే సమయంలో ఏమైనా సవాళ్లు ఎదురయ్యాయా?
సుప్రియ: చాలామంది కొత్త వ్యక్తులతో పనిచేశాను. అది సవాలుగా అనిపించింది. నేను ఎడిట్ రూమ్‌లో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చుట్టూ కొత్తవారే. మొదట అనుకున్న సమయానికి సినిమాను అందించగలమో లేదో అని భయపడ్డా.. అంతా అనుకున్న సమయానికే పూర్తయింది.