Select Location
All Locations
State
Region
City / District
ఏపీ సీఎం చంద్రబాబు అప్పుడలా ఇప్పుడిలా.. దక్షిణాదికి జరిగే అన్యాయంపై నోరు మెదపని వైనం

ఏపీ సీఎం చంద్రబాబు అప్పుడలా ఇప్పుడిలా.. దక్షిణాదికి జరిగే అన్యాయంపై నోరు మెదపని వైనం

హైదరాబాద్, వెలుగు: కేంద్రం చేపడుతున్న లోక్​సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి చర్చనీయాంశంగా మారింది. గతంలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్​ చేపట్టాలన్న ఎన్​డీఏ సర్కారు నిర్ణయాన్ని ఏనాడూ వ్యతిరేకించని బాబు అండ్ ​కో.. తీరా ఇప్పుడు తమ వల్లే కేంద్రం ప్రోరేటాకు ఒప్పుకుందనేలా కలరింగ్​ ఇచ్చుకుంటున్నారు. నిజానికి జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై మిగిలిన సీఎంలు ఏడాది కాలంగా గొంతెత్తుతున్నా.. బాబు ఏనాడూ స్పందించలేదు.

నిరుడు స్టాలిన్​ అధ్యక్షతన చెన్నై లో నిర్వహించిన మీటింగ్​కు సైతం ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం హాజరుకాలేదు. చెన్నై వేదికగా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు కేంద్రానికి స్ట్రాంగ్​ వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు సీఎంలు పలు ప్రతిపాదనలతో వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లే కేంద్రం దిగివచ్చినట్లు స్పష్టమవుతున్నా, చివర్లో అదంతా తనవల్లేనని చెప్పుకునేందుకు బాబు తాపత్రయపడుతున్న తీరుపై విస్మయం వ్యక్తమవుతున్నది. జనాభా ఆధారంగా డీలిమిటేషన్​ చేపడితే ఏపీకి నష్టం జరుగుతుందని, అందువల్ల ప్రతి జంటా ముగ్గురు పిల్లల్ని కనాలని అప్పట్లో అక్కడి ప్రజలకు బాబు పిలుపునిచ్చారు.

అంటే జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కానీ జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని మిగిలిన దక్షిణాది సీఎంలు ఏడాదికాలంగా గొంతెత్తుతున్నారు. గతేడాది మార్చి 22న తమిళనాడు సీఎం స్టాలిన్​అధ్యక్షతన డీలిమిటేషన్​అంశంపై చెన్నైలో జరిగిన మీటింగ్​కు తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, భగవంత్ సింగ్ మాన్, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీఆర్ఎస్​, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీల నేతలు హాజరై కేంద్రానికి స్ట్రాంగ్​ వార్నింగ్​ఇచ్చారు. 

జనాభా ప్రాతిపదికన చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజనకు తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని, 25 ఏండ్ల పాటు డీలిమిటేషన్ వాయిదావేయాలని డిమాండ్​చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. నిజానికి ఈ సమావేశం తర్వాతే కేంద్రంలోని బీజేపీ సర్కారు ‘జనాభా ప్రాతిపదికన పునర్విభజన’​పై పునరాలోచనలో పడింది. ఇది మరో ద్రవిడ ఉద్యమానికి దారి తీస్తుందేమోనని భయపడింది. ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు సీఎంల బెదిరింపులు, వ్యూహాలు ఫలించడం వల్లే ఈమాత్రమైనా దిగివచ్చిన కేంద్రం ప్రోరేటా ప్రకారం అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం చొప్పున సీట్ల పెంపునకు ఒప్పుకుందని, ఇది ముమ్మాటికీ రేవంత్, స్టాలిన్​విజయమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.


V6 News 1 hour ago
Home Flash News