ఆ క్యాచ్ తర్వాత.. ముంబయి దూకుడు ఆగింది: శ్రేయస్ అయ్యర్
ఇంటర్నెట్ డెస్క్: వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. భారీ స్కోరు చేస్తుందేమో అనుకున్న ముంబయికి తమ ఫీల్డింగ్, బౌలింగ్‌తో పంజాబ్ అడ్డుకట్ట వేసింది. మరీ ముఖ్యంగా అర్ష్‌దీప్ స్పెల్‌తోపాటు హార్దిక్ పాండ్య (17.3వ ఓవర్) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద సూపర్‌గా ఒడిసిపట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఈ క్రెడిట్ దక్కుతుంది. అప్పటికే ముంబయి స్కోరు 175 పరుగులు. ఆ తర్వాత ముంబయి 21 బంతుల్లో కేవలం 20 పరుగులే చేయడం గమనార్హం. మ్యాచ్ అనంతరం శ్రేయస్ కూడా ఆ క్యాచ్ వల్లే ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో దూకుడు తగ్గించగలిగినట్లు వెల్లడించాడు. ఇక లక్ష్య ఛేదనలోనూ హాఫ్ సెంచరీతో శ్రేయస్ ఆకట్టుకున్నాడు. ఛేజింగ్ కింగ్‌గా ఉన్న విరాట్ కోహ్లీ సరసన చేరేలా శ్రేయస్ ఆటతీరు ఉంది.
‘‘లీగ్‌లో ప్రతి మ్యాచ్‌లో గెలుస్తామనే నమ్మకం, ఆశావాదంతోనే ఉన్నాం. అలాగే ముందుకుసాగుతున్నాం. అదే సమయంలో మనకు సరైన విచక్షణ కూడా అవసరం. మైదానంలోకి దిగాక ప్రతి మ్యాచ్ అత్యంత కీలకమని తెలుసుకోవాలి. జట్టుగా ఆడి విజయం సాధించాం. ప్రభ్ సిమ్రన్ మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. పవర్ ప్లేలో అద్భుతమైన ఆరంభాలు ఇస్తున్నాడు. ఇప్పుడు మ్యాచ్‌ను ముగించేవరకూ ఉండేంత పరిణతి సాధించాడు. ముంబయి ఇండియన్స్‌ను మా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. అయితే, బౌండరీ లైన్ వద్ద హార్దిక్ క్యాచ్‌తోనే వారి దూకుడుకు అడ్డుకట్ట పడింది. ఒక్కోసారి ప్రత్యర్థి జట్టు ఆధిపత్యం సాధించినా.. పుంజుకొని మరీ వారిని ఆపిన సందర్భాలు ఉన్నాయి. సన్‌రైజర్స్‌తోనూ పవర్ ప్లేలో భారీగా పరుగులు ఇచ్చాం. కానీ, ఆ తర్వాత కట్టడి చేయడంలో మా బౌలర్ల కృషి అద్భుతం. ఇక టాస్‌ల పరంగానూ నేను లక్కీ. మాకు కలిసొస్తోంది. పంజాబ్ కింగ్స్‌కూ అభిమాన గణం పెరిగింది. ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది. మున్ముందు రోజుల్లోనూ ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు’’ అని శ్రేయస్ వెల్లడించాడు.