కాళేశ్వర క్షేత్రానికి కొత్త కళ..రూ.198 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం శ్రీకాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం శ్రీకాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సోమవారం కాళేశ్వరంలో పర్యటించిన ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో రూ.198 కోట్ల భారీ బడ్జెట్‌తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు.
ఈ నిధులతో ఆలయ విస్తరణ, భక్తుల కోసం మెరుగైన వసతుల కల్పన, క్యూ లైన్ల ఆధునీకరణ మరియు గోదావరి నది తీరంలో స్నానఘట్టాల అభివృద్ధి వంటి పనులు వేగవంతం చేయనున్నారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా కాళేశ్వరాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న రోజుల్లో భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం కల్పించడంతో పాటు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.