Select Location
All Locations
State
Region
City / District
అందుకే నో క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ అప్లై చేశా: పార్తిబన్ వివరణ

అందుకే నో క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ అప్లై చేశా: పార్తిబన్ వివరణ

ఇంటర్నెట్‌ డెస్క్: సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.పార్తిబన్‌ (Parthiban) తన నిర్ణయంతో మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు ఏ కులం, మతం లేదని అధికారికంగా గుర్తించే ‘నో కాస్ట్ - నో రిలీజియన్ సర్టిఫికెట్’ పొందాలని ఆయన నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ.. ఏప్రిల్ 29లోపు సంబంధిత సర్టిఫికెట్‌ను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో పార్తిబన్‌ వివరించారు.

‘‘కోర్టు తీర్పు చూసి ఎంతో ఆనందించా. కులమతాలపై నాకు ఎలాంటి ఆసక్తి లేదు. కొంతమందికి వాటిపై బలమైన భావాలు ఉంటాయి. నేను వారిలాంటి వ్యక్తిని కాను. ఇటీవల ఒక కార్యక్రమంలో నేను పొరపాటున కులం పేరు ప్రస్తావించాను. ఆ మాట చాలామందిని బాధ పెట్టింది. ఆ క్షణం నేను కూడా భావోద్వేగానికి గురయ్యా. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ఏ కులానికి, మతానికి చెందనివాడినని తెలిపే సర్టిఫికెట్ పొందాలని పిటిషన్‌ వేశా (NO Caste and NO Religion Certificate). 

కులమతాలు లేని ఓ కొత్త సమాజాన్ని సృష్టించే దిశగా నేను వేస్తున్న ముఖ్యమైన అడుగు ఇది. ఒక సామాన్యుడు ఇలాంటి సర్టిఫికెట్ కోరుకుంటే దానికోసం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రక్రియ మరింత సులభంగా ఉండాలి. కులం ప్రాతిపదికన వచ్చే ఎలాంటి ప్రయోజనాలను కూడా నేను కోరుకోవడం లేదు. కష్టపడి పైకి రావడమే నాకు ఇష్టం’’ అని పార్తిబన్‌ చెప్పారు. ఈ నిర్ణయం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, సమాజంలో మార్పు కోసమేనని ఆయన స్పష్టం చేశారు.


Eenadu Telugu 11 days ago
Home Flash News