IND vs PAK: నాకూ ఆ ఉద్దేశం లేదనే చెప్పాను: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా చోటుచేసుకున్న ‘నో షేక్‌హ్యాండ్’ వివాదంపై.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా తాజాగా స్పందించాడు. ఆరోజు తాను ఎప్పటిలాగే గడుస్తుందని భావించానన్నాడు. అయితే, టాస్ సమయంలోనే తనకు నిజం తెలిసిందన్నాడు. కరచాలనానికి నిరాకరణ ఈ పరిణామాల క్రమంలో తొలిసారి దాయాదులు టీమిండియా- పాక్ (IND vs PAK) ఆసియా కప్-2025 సందర్భంగా ముఖాముఖి తలపడ్డాయి. అయితే, టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘాతో కరచాలనానికి టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ నిరాకరించాడు. ఇక ఈ మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే.
అయితే, పాక్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరిస్తూ మ్యాచ్ ముగించిన సూర్య, శివం దూబే మైదానాన్ని వీడారు. మిగతా ఆటగాళ్లు సైతం డ్రెసింగ్‌రూమ్‌లోనే ఉండిపోయారు. దీంతో పాక్ జట్టు అవమానభారంతో మైదానాన్ని వీడింది. షాకిచ్చిన ఐసీసీ ఈ విషయం గురించి పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందుగా నో షేక్‌హ్యాండ్ గురించి తమకు సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. కాబట్టి అతడిపై వేటు వేయాలని పట్టుబట్టింది. అయితే, ఐసీసీ ఇందుకు నిరాకరించింది. రిఫరీ నిబంధనలు ఉల్లంఘించారనేందుకు ఎలాంటి ఆధారం లేదని కొట్టిపారేసింది.
ఇక బీసీసీఐ సైతం.. ఆటగాళ్లు కచ్చితంగా కరచాలనం చేసుకోవాలన్న నిబంధన ఏమీ లేదని గుర్తు చేస్తూ టీమిండియాను సమర్థించింది. నాటి ఈ ఘటనపై సల్మాన్ ఆఘా తాజాగా మరోసారి గుర్తుచేసుకున్నాడు. కరచాలనం చేయాలనే ఆసక్తి ఏమీ లేదు ‘‘మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశం.. ట్రోఫీ ఫొటోషూట్ జరిగింది. అక్కడ కూడా షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక టాస్ సమయంలో నేను మైదానంలోకి వెళ్లినపుడు.. అంతా సాధారణంగానే ఉంటుందని భావించాను. అయితే, అంతలోనే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని నాకు అర్థమై పోయింది. అప్పుడే రిఫరీ నన్ను పక్కకు తీసుకువెళ్లి.. ‘ఫ్రెండ్.. ఇక్కడ షేక్‌హ్యాండ్ ఉండదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అని నాతో చెప్పారు. అప్పుడు నేను..
‘నాకు కూడా కరచాలనం చేయాలనే ఆసక్తి ఏమీ లేదు’ అని చెప్పాను. టాస్ సమయంలో ముందుగానే నో షేక్‌హ్యాండ్ గురించి చెప్పారు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత పెవిలియన్‌కు చేరే సమయంలోనూ వాళ్లు (టీమిండియా) కరచాలనం చేసేందుకు ముందుకు రాలేదు’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. ఓవరాక్షన్ ఎందుకు? తద్వారా నాడు ఈ విషయంలో మ్యాచ్ రిఫరీ తమకు ముందుగానే సందేశం ఇచ్చాడని ఆఘా స్పష్టంచేశాడు. దీంతో పాక్ బోర్డు ఫిర్యాదుపై ఐసీసీ సరైన విధంగానే స్పందించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసియా కప్-2025 ఫైనల్లో టీమిండియా పాక్‌ను ఓడించి ట్రోఫీ గెలిచింది.