ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం..నిందితులకు హైకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితులకు ఊరట లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను అరెస్టు చేయవద్దంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు జూన్ 24వ తేదీ వరకు పొడిగించింది. తమపై నమోదైన కేసులను సవాలు చేస్తూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా, ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై వచ్చే నెల 6వ తేదీలోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. కోర్టు తాజా ఆదేశాలతో నిందితులకు అరెస్టు భయం నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లయింది.