Iran War | అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చు.. సిద్ధంగానే ఉన్నామన్న ఇరాన్
Iran War : ఇరాన్–అమెరికా మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. చర్చలు ఎప్పుడు జరుగుతాయో, అసలు జరుగుతాయో లేదో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కూడా రద్దు కావొచ్చు. ఇదే జరిగితే, ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభం కావొచ్చు. అయితే, ఈ విషయంపై ఇరాన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరాన్ డిప్యూటీ ఆఫ్ ద మిలిటరీ హెడ్‌క్వార్టర్స్ అధికారి మొహమ్మద్ జాఫర్ అసాది మాట్లాడుతూ, అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభం కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం విషయంలో అమెరికా అంత ఆసక్తిగా లేదని, దీంతో యుద్ధం తప్పకపోవచ్చని ఆయన అన్నారు.
అమెరికా ఇటీవల తీసుకుంటున్న చర్యలు, ప్రకటనలు చూస్తే ద్వైపాక్షిక అంశాలపై అమెరికాకు చిత్తశుధ్ది లేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. అమెరికా ఇటీవల చేసిన ప్రకటనలు ముందుగా చమురు ధరలు తగ్గించేందుకేనని, అలాగే వాళ్లు సృష్టించిన గందరగోళాన్ని తగ్గించేందుకే అని అసాది అన్నారు. చర్చల విషయంలో అమెరికాకు చిత్తశుద్ధి లేకపోవడంతో అమెరికాతో తమ దేశానికి మళ్లీ యుద్ధం తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు. అందుకే యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు తమ సైనిక దళాలు పూర్తి సిద్ధంగా, హై అలర్ట్‌తో ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య తాజా చర్చల అంశంలో ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై తాను అసంతృప్తితో ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ నుంచి తాజా ప్రకటన వెలువడింది.