శ్రీశైలంలోనూ శ్రీ గిరి ప్రదక్షణ : వైభవంగా స్వామివార్ల ఊరేగింపు
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. మే 1వతేది వైశాఖ పౌర్ణమి సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్ల మహామంగళహరతుల అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను జేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత శ్రీస్వామి అమ్మవార్లను ధర్మప్రచార రథంలో ఊరేగింపుగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు,అర్చకులు ఘనంగా చేశారు.
గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై గంగాధర మండపము, ఆంకాళమ్మ ఆలయం, నందిమండపము, గంగాసదనము,బయలు వీరభద్రస్వామి ఆలయం పంచమఠాలు,మల్లమ్మ కన్నీరు పుష్కరిణి వద్దకు చేరుకొని తిరిగి నంది మండపము మీదుగా ఆలయ మహద్వారము చేరుకోవడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది. శ్రీశైల క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు .ఈ గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు, అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.