గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన పళనిస్వామి..తమిళనాడు కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ
తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే విజయ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండోసారి ఇవాళ(మే6) గవర్నర్ ను కలిశారు. ఈ క్రమంలో అన్నాడీఎంకే చీప్ పళనిస్వామి కూడా గవర్నర్ కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పళని స్వామి గవర్నర్ కలిసి ఏం చేయబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. అనుమతివ్వండి అంటూ విజయ్ గవర్నర్ ను కోరినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేదని విజయ్‌కి షాక్ ఇచ్చారు గవర్నర్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 118 ఎమ్మెల్యేలు అవసరం కాగా 112 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మిగతా ఎమ్మెల్యేల మద్దతు విషయంలో విజయ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. బలనిరూపణకు రెండు రోజుల గడువిచ్చారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే, 108 సీట్లు గెలుచుకుని అద్భుత విజయం సాధించినప్పటికీ, మెజారిటీకి ఇంకా చేరలేదు.
ఈ రాజకీయ అనిశ్చితి పార్టీల మధ్య తెరవెనుక తీవ్ర చర్చలకు దారితీసింది. డీఎంకే కీలక మిత్రపక్షమైన వీసీకే, గురువారం సమావేశం అనంతరం తమ వైఖరిని ప్రకటిస్తుందని భావించినప్పటికీ ఇప్పుడు ఆ చర్చను రద్దు చేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇదిలా ఉండగా తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఫిరాయింపుల భయంతో ఏఐఏడీఎంకే 15 మందికి పైగా ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్‌కు తరలించారు. సంఖ్యాపరమైన పోరు కొనసాగుతున్నప్పటికీ శుక్రవారం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరగనున్న విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.